Madhuyashki Goud : ఫాంహౌస్‌కు పిలుచుకుని కాళ్లు మొక్కినా నేత‌లు ఆ పార్టీలో ఉండటం లేదు

ఫామ్ హౌస్ కు పిలుచుకొని కాళ్ళు మొక్కినా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్లోకి వస్తున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ వ్యాఖ్యానించారు.

By :  Eha Tv
Update: 2024-07-11 14:12 GMT

పదేళ్లుగా సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంటి గేటు లోపలికి రానివ్వకుండా తరిమికొట్టి వారిని కెసిఆర్ తీవ్రంగా అవమానించారని.. అందుకే ఇప్పుడు ఫామ్ హౌస్ కు పిలుచుకొని కాళ్ళు మొక్కినా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్లోకి వస్తున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ వ్యాఖ్యానించారు.

గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ... కనీసం నీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏనాడైనా గౌరవించావా..? అందుకే నీకు ఈ గతి పట్టిందని పేర్కొన్నారు. టిడిపి నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి ఏ విధంగా మంత్రి పదవులు ఇచ్చారని.. అప్పుడు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా కేటీఆర్..? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఈ ప్రభుత్వం కొనసాగదని, కూలిపోతుందని, పడిపోతుందని.. ఒకవైపు కేటీఆర్, మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లు మాట్లాడారు. ఆఖరికి కాలు విరిగి యశోద ఆసుపత్రిలో పడుకున్న కేసీఆర్ కూడా ప్రభుత్వం ఉండదని రెచ్చగొట్టింది నిజం కాదా..? అని మధు యాష్కి గౌడ్ వ్యాఖ్యానించారు.

బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక్కటై అప్రజాస్వామికంగా తమ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తే.. ప్రజాస్వామ్యయుతంగా తమ పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని, అవినీతి చేస్తే కొడుకు అయినా బిడ్డ అయినా అల్లుడైన సహించేది లేదని చెప్పిన కెసిఆర్ కు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరికిన బిడ్డ కవితను బయటకు తీసుకొచ్చేందుకు అపసోపాలు పడుతున్నారన్నారు.

ఇందుకు మోదీతో కుమ్మక్కై బిడ్డను జైలు నుంచి విడిపించి.. తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న కుట్ర చేశాడని ఆరోపించారు. అందుకే తమ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజలు కనీసం తమ సమస్యలు చెప్పుకునే హక్కు కూడా లేకుండా ధర్నా చౌక్ ని ఎత్తేసిన దుర్మార్గ చరిత్ర మీది కాదా..? ప్రజాస్వామ్యం రాజ్యాంగ హక్కుల గురించి మీరా మాట్లాడేది.? అని కేటీఆర్ పై మధుయాష్కిగౌడ్ ఫైర్ అయ్యారు

ఎంతోమంది నిరుద్యోగ యువత తమ ఆస్తులను తాకట్టు పెట్టి కోచింగ్ లు తీసుకొని.. పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు అన్నారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల నుంచి కమిషన్లు తినమరిగిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు.. నిరుద్యోగులను పరీక్షలు వాయిదా వేయించాలని ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు కల్పించాలని కోరడం పోయి వాయిదా వేయించాలని చెప్పడం దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు.

పదేళ్లలో ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావులు... ఏ ఒక్క రోజైనా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలంగాణలోని ఏ యూనివర్సిటీలోనైనా అడుగుపెట్టే దమ్ము మీకుందా..? అని స‌వాల్ విసిరారు.

పింక్ పార్టీల రౌడీలు విద్యార్థుల ముసుగులో.. డీఎస్సీ, గ్రూప్ -2 పరీక్షలు వాయిదా వేయించాలని కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిజమైన అభ్యర్థుల జీవితాలు ఆగం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

Tags:    

Similar News