Asifabad Jainoor: జైనూరులో కర్ఫ్యూ విధించిన పోలీసులు.. ఇంటర్నెట్ బంద్
జైనూరులో కర్ఫ్యూ
By : Sreedhar Rao
Update: 2024-09-05 03:32 GMT
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆగ్రహించిన ఆదివాసీలు ఓ వర్గానికి చెందిన కొన్ని దుకాణాలు, వాహనాలను తగులబెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనికి ప్రతీకారంగా జైనూర్ పట్టణంలోని దుకాణాలను ఇతర వర్గీయులు తగులబెట్టారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఆదివాసీ మహిళపై లైంగికదాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వ్యక్తికి వ్యతిరేకంగా జైనూరులో నిరసనలు మొదలయ్యాయి. అవి కాస్తా మతఘర్షణలకు కారణమయ్యాయి.
ఈ పరిస్థితుల మధ్య జైనూరులో కర్ఫ్యూ విధించినట్లు డీజీపీ తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు కర్ఫ్యూ అమలు చేస్తామని తెలిపారు. రెండువర్గాల మధ్య ఘర్షణలు, రాళ్లదాడులు జరిగాయని, దీంతో పలువురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు రంగంలోకి వెయ్యిమంది పోలీసులు దిగారు. ఘటనకు కారణమైన నిందితుడ్ని ఇప్పటికే అరెస్ట్ చేశామని.. వెయ్యిమంది పోలీసులతో పహారా నిర్వహిస్తున్నామని డీజీపీ తెలిపారు. ఎవరైనా తప్పుడు వార్తలను ప్రచారంచేస్తే కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం ఇంటర్‌నెట్ సర్వీస్ లను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.