Hathras Stampede : హాథ్రాస్‌ తొక్కిసలాట.. పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆర్గనైజర్‌

హాథ్రాస్‌ తొక్కిసలాటకు కారకుడైన దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడి కారణంగా వందలాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 2వ తేదీన జరిగిన హథ్రాస్‌ సత్సంగ్‌ కార్యక్రమానికి దేవ్‌ ప్రకాశ్‌ ఆర్గనైజర్‌గా ఉన్నాడు.

By :  Eha Tv
Update: 2024-07-06 07:04 GMT

హాథ్రాస్‌(Hathras) తొక్కిసలాటకు కారకుడైన దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌(Dev Prakash Madhukar) పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడి కారణంగా వందలాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 2వ తేదీన జరిగిన హథ్రాస్‌ సత్సంగ్‌(Hathras satsang) కార్యక్రమానికి దేవ్‌ ప్రకాశ్‌ ఆర్గనైజర్‌గా ఉన్నాడు. తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత అతడు పరారయ్యాడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. శుక్రవారం అతడు ఢిల్లీ పోలీసుల(Delhi Police) ముందు లొంగిపోయాడు. తర్వాత అతడిని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు(Uttar Pradesh Police) తమ అదుపులో తీసుకున్నారు. హాథ్రాస్‌ సత్సంగ్‌కు దేవ్‌ ప్రకాశ్ మధుకర్‌ ప్రధాన ఆర్గనైజర్‌గా ఉన్నాడు కానీ అతడు ఏ తప్పు చేయలేదని దేశ్‌ప్రకాశ్‌ తరపు న్యాయవాది ఏపీ సింగ్‌ అంటున్నారు. దేవ్‌ప్రకాశ్‌ హార్ట్‌ పేషంట్‌ అని, అతనికి ఏమీ జరగకూడదని కోరుకుంటున్నామని చెప్పారు. తాము ఎటువంటి ముందస్తు బెయిల్​ కోసం కోర్టుకు వెళ్లమని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఏపీ సింగ్‌ తెలిపారు. ఇదిలా ఉంటే దేవ్‌ ప్రకాశ్‌ లొంగిపోయిన విషయాన్ని పోలీసులు ఇంకా ప్రకటించలేదు. జూలై 2వ తేదీన ఆధ్యాత్మికవేత్తగా చెప్పుకుంటున్న భోలే బాబా(Bhole Baba) హాథ్రాస్‌ జిల్లాలోని ఫూల్‌రాయ్‌ గ్రామంలో సత్సంగ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో భక్తులు, అనుచరులు వచ్చారు. భోలే బాబా తన ప్రవచనాలు చెబుతున్నప్పుడే ఒక్కసారిగా పెనుగులాట చోటుచేసుకుంది. భోలే బాబా పాదాలను తాకాలని భక్తులు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. చాలా మంది కిందపడిపోయారు. కిందపడ్డ వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఊపిరి అందక ఆర్తనాదాలు చేస్తూ చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 121 మంది చనిపోయారు. తొక్కిసలాటపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ న్యాయ విచారణకు ఆదేశించారు. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిర్వాహకులు సాక్ష్యాలను దాచిపెట్టారని, నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు చెబుతున్నారు. అసలు నిందితుడు భోలే బాబా ఆప్పట్నుంచి పత్తా లేకుండా పోయాడు. అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Tags:    

Similar News