Satish Jarkiholi : సిద్ధరామయ్యను త‌ప్పిస్తే.. రేవంత్‌కు ఇబ్బందులే.. మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

‘ముడా’ భూ కుంభకోణం కేసు సిద్ధరామయ్య సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్ర‌తిప‌క్ష బీజేపీ, జేడీఎస్‌లు కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి

Update: 2024-08-22 03:32 GMT

‘ముడా’ భూ కుంభకోణం కేసు సిద్ధరామయ్య సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్ర‌తిప‌క్ష బీజేపీ, జేడీఎస్‌లు కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. అయితే.. అవ‌న్నీ ఆరోప‌ణ‌లే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చే ప్ర‌య‌త్నాల‌ని అధికార ప‌క్షం వాదిస్తుంది. ఈ నేప‌థ్యంలోనే కర్ణాటక మంత్రి సతీష్ జార్కిహోళి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట్లాడుతూ.. సీఎం సిద్ధరామయ్యను తొలగించే ఏ ప్రయత్నమైనా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కూల్చివేసే అవకాశం ఉందని అన్నారు. బెంగళూరులోని నివాసంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా అండగా నిలుస్తుందని.. ఆయనను మార్చే ప్రశ్నే లేదని అన్నారు. బీజేపీ సిద్ధరామయ్యను బలహీనపరిచేందుకు.. కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నాల‌ను చేస్తోందని ఆరోపించారు. క‌ర్ణాట‌క‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, జేడీఎస్‌లు కలిసి పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.

సిద్ధరామయ్యపై ఎలాంటి అభియోగాలు రుజువు కాలేదని.. అవసరమైతే విచారణ చేపట్టవచ్చని మంత్రి సూచించారు. సిద్ధరామయ్యను బీజేపీ టార్గెట్ చేసిందని.. న్యాయపరంగా, రాజకీయంగా పోరాడతామని అన్నారు. ఇప్పటికే హైకమాండ్ సిద్ధరామయ్యకు మద్దతిస్తుందని.. ఆయనకు మద్దతుగా మరింత బలంగా నిలుస్తుందని జార్కిహోళి స్పష్టం చేశారు. గవర్నర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని,.. ఇది ముఖ్యమంత్రిని బలహీనపరచడమే లక్ష్యంగా ఉందని విమర్శించారు.

సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని పడగొట్టడం వల్ల తెలంగాణ ప్రభుత్వ పతనంతో సహా తీవ్ర పరిణామాలు ఉంటాయని జార్కిహోలీ వ్యాఖ్యానించారు. సీఎం సిద్ధరామయ్యను మార్చవద్దన్న మంత్రి.. పనిలో పనిగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారుకు ఏదైనా ఇబ్బంది కలిగితే.. ఆ ప్రభావం తెలంగాణలోని రేవంత్‌ సర్కారుపై పడొచ్చు. ఇక్కడ సిద్ధరామయ్య ఇబ్బందులను ఎదుర్కొంటే, తర్వాత తెలంగాణలో రేవంత్‌ రెడ్డి కూడా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఇక్కడ సిద్ధరామయ్యకు నోటీసులు వచ్చినట్టే, అక్కడ రేవంత్‌కు కూడా రేపోమాపో నోటీసులు రావొచ్చు. ఆయననూ టార్గెట్‌ చేయొచ్చు. ఇప్పుడు సిద్ధరామయ్యను సీఎం పోస్టు నుంచి తప్పిస్తే.. రేవంత్‌నూ తప్పించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే.. తప్పుచేసినట్టు మనకు మనం ఒప్పుకొన్నట్టే.. అందుకే తమ నాయకుడికి వెన్నుదన్నుగా ఉండి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ నాయ‌క‌త్వానికి సూచించారు. 

Tags:    

Similar News