Telangana : సీఎం రేవంత్‌ గుడ్‌న్యూస్‌.. సాయంత్రం 4 గంటలకు రైతురుణాలు మాఫీ.!

గురువారం సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు

By :  Eha Tv
Update: 2024-07-18 02:38 GMT

గురువారం సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. నిన్న కాంగ్రెస్ నేత‌ల‌తో స‌మావేశ‌మైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించండని సూచించారు. రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయని.. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామ‌ని తెలిపారు. ఆగస్టు లో రూ.2లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామ‌న్నారు. ప్రతీ రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమ‌న్నారు.

రుణమాఫీ పేరుతో కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడంలేదని విమ‌ర్శించారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని.. అందుకే ఏకమొత్తంలో రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామ‌న్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నామ‌న్నారు. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించండని నేత‌ల‌ను కోరారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాల‌ని.. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాల‌ని సూచించారు. రుణమాఫీపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి.. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేయలేదు. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంట్ లో ఎంపీలు ప్రస్తావించాలి. గురువారం గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలని శ్రేణుల‌ను ఆదేశించారు.

Tags:    

Similar News