Ex Minister Jagadeesh Reddy : రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేయడం వెనుక వున్న మతలబు ఏంటి..?
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం అయిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం అయిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు సాయాన్ని ఆపడానికి వీలులేదని అన్నారు. రైతు భరోసా పేరుతో 15,000 ఇస్తామని మాట తప్పారని విమర్శించారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారు.. కేబినెట్ సబ్ కమిటీ వెనుక వున్న మతలబు ఏంటి..? అని ప్రశ్నించారు.
రైతు ఋణమాఫీతో సంబంధం లేకుండా రైతు బంధు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వమని విమర్శించారు. పింఛన్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. విద్యుత్ బిల్లుల మాఫీ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు.
యాసంగిలో రైతులకు ఏ విధంగా రైతుబంధు ఇచ్చారో ఇప్పుడు అట్లాగే ఇవ్వండని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో జూన్ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతు బంధు వచ్చేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయన్నారు.
వీధి కుక్కలు సైతం మహిళలపై దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉందా లేదా అనేది అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోను శాంతిభద్రతలు బాగోలేవన్నారు. ప్రభుత్వం లీకేజీలు తప్ప ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫీయా నదులను తోడేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో దారిదోపిడీ లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టాలన్నారు. విద్యుత్ కమీషన్ నుండి నాకు లెటర్ వచ్చింది. లేఖ ఇచ్చిన వారం రోజుల్లో కమీషన్ కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారు. విద్యుత్ కమీషన్ కు నాకు వున్న సమాచారాన్ని ఇస్తానని తెలిపారు.
కమీషన్ కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతానన్నారు. అందరినీ విచారిస్తేనే కమీషన్ కు సమగ్ర సమాచారం వస్తుందన్నారు. ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, విద్యుత్ అధికారుల నుండి కమీషన్ సమాచారం తీసుకోవాలన్నారు. ఈఆర్సీపై ఎన్.జి.టి స్టే ఇచ్చింది.. ఎన్.జి.టి ను విచారణకు పిలుస్తారా..? పర్యావరణ అనుమతులు ఇచ్చిన వారిని విచారణకు పిలుస్తారా..? అందరిని విచారణకు పిలువకపోతే సమగ్ర విచారణ కిందకు రాదన్నారు.
కమీషన్ చైర్మన్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడిన తర్వాత ఆరు వేల కోట్ల నష్టం జరిగినట్లు సమాచారాన్ని ప్రజలకు తెలిపారు. సమాచారాన్ని తెలిపిన వారిని కమీషన్ చైర్మన్ విచారణకు పిలవాలన్నారు. కమీషన్ ఏర్పాటు చేసి లీకులు ఇస్తే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లేనన్నారు. మేము లేవనెత్తిన అంశాలపై కమిషన్ విచారణ చేయాలన్నారు.. లేకుంటే కమీషన్ చైర్మన్ బాధ్యతగా తప్పుకోవాలని కోరుతానన్నారు.