WCL - 2024 : రాణించిన రాయుడు.. పాక్‌ను చిత్తుగా ఓడించి టైటిల్ నెగ్గిన టీమిండియా..!
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఛాంపియన్స్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఛాంపియన్స్‌ను ఓడించింది.
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఛాంపియన్స్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఛాంపియన్స్‌ను ఓడించింది. దీంతో ఈ టోర్నీలో భారత్ తొలి టైటిల్ కైవసం చేసుకుంది. గ్రూప్ దశలో భారత్ రెండు మ్యాచ్‌లు గెలిచి మూడింటిలో ఓడిపోయింది. అయితే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్ కు అర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో టీమిండియా నాలుగో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది.
బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. షోయబ్ మాలిక్ 41 పరుగులతో రాణించడంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 156 పరుగులు చేసింది. అనంతరం అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో భారత్ 19.1 ఓవర్లలో ఐదు వికెట్లకు 159 పరుగులు చేసి ఐదు వికెట్లు, ఐదు బంతులు మిగిలి ఉండగానే భారత్ మ్యాచ్‌ను గెలుచుకుంది.
157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి వచ్చిన భారత జట్టుకు పర్వాలేదనే శుభారంభం లభించింది. రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు మధ్య తొలి వికెట్‌కు 34 పరుగుల భాగస్వామ్యం ఏర్పడగా.. అమీర్ దానిని బ్రేక్ చేశాడు. అమీర్ బౌలింగ్‌లో ఉతప్ప(10) ఓటయ్యాడు. తర్వాత మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సురేశ్ రైనా నాలుగు పరుగులు చేసి అమీర్ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత గుర్కీరత్ సింగ్ మాన్ క్రీజులోకి వచ్చాడు. మూడో వికెట్‌కు రాయుడుతో కలిసి 25 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో రాయుడు అర్ధ సెంచరీ సాధించాడు. అతడు 166.66 స్ట్రైక్ రేట్ లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. గుర్కీరత్ సింగ్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 34 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు. యూసుఫ్ పఠాన్ 30 పరుగులు చేశాడు. యువరాజ్ 15 పరుగులతో, ఇర్ఫాన్ ఐదు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో అమీర్ రెండు వికెట్లు తీయగా.. సయీద్ అజ్మల్, వాహబ్ రియాజ్, షోయబ్ మాలిక్ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభం నెమ్మదిగానే లభించింది. కమ్రాన్ అక్మల్, షర్జీల్ ఖాన్ మధ్య తొలి వికెట్‌కు 14 పరుగుల భాగస్వామ్యాన్ని అనురీత్ సింగ్ బ్రేక్ చేశాడు. రాహుల్ శుక్లా.. షార్జీల్ క్యాచ్ అందుకున్నాడు. అతడు 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత కమ్రాన్, సోహెబ్ మక్సూద్ రెండో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మక్సూద్ 12 బంతుల్లో 21 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో నాలుగు ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసి అక్మల్ ఔటయ్యాడు. ఆ తర్వాత షోయబ్ మాలిక్ 36 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో యూనిస్ ఖాన్ ఏడు పరుగులు, మిస్బా ఉల్ హక్ 18 పరుగులు, అమీర్ యామిన్ ఏడు పరుగులు చేశారు. కాగా, షాహిద్ అఫ్రిది 4, సోహైల్ తనీర్ 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత్ తరఫున అనురీత్ సింగ్ మూడు వికెట్లు తీయగా, వినయ్‌కుమార్, పవన్ నేగి, ఇర్ఫాన్ పఠాన్ ఒక్కో వికెట్ తీశారు.