Tamil Nadu BSP chief Armstrong Murder : హత్యకు గురైన ఆ గ్యాంగ్‌స్టర్ తమ్ముడే ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చంపాడట..!
తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు కె. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు రోజురోజుకూ ముదురుతోంది
తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు కె. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు రోజురోజుకూ ముదురుతోంది. ఈ విషయమై చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో గ్యాంగ్‌స్టర్ ఆర్కాట్ సురేశ్ సహచరుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గతేడాది ఆగస్టులో ఆర్కాట్ సురేష్ హత్యకు గురయ్యాడు.
ఈ ఘటనకు సంబంధించి ఉత్తర చెన్నై అదనపు పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) అస్రా గార్గ్ మాట్లాడుతూ.. విచారణ తర్వాత ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నేరానికి ఉపయోగించిన ఏడు ఆయుధాలు, జొమాటో టీ షర్ట్, జొమాటో బ్యాగ్, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. చెన్నై పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. 2023 ఆగస్టులో ఆర్కాట్ సురేష్ హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించి అతని కుటుంబం, సహచరులు ఆర్కాట్ సురేష్ హత్య వెనుక ఆర్మ్‌స్ట్రాంగ్ హస్తం ఉందని భావిస్తున్నాం. ఆర్కాట్ సురేష్ సహచరులు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేశారని.. అతని సోదరుడు సహా నిందితులను మేము అరెస్టు చేశామని చెప్పారు.
ద్విచక్రవాహనంపై వచ్చి ఆర్మ్‌స్ట్రాంగ్ పై దాడి చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతికకాయానికి చెన్నైలోని కార్పొరేషన్ స్కూల్ గ్రౌండ్‌లో ప్రజల నివాళులర్పించారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌కు నివాళులర్పించేందుకు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు నేతలు తరలివచ్చారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆ పార్టీ జాతీయ సమన్వయకర్త కూడా అధినేతకు నివాళులర్పించేందుకు చెన్నై బయలుదేరి వెళ్లారు. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఎస్పీ అధిష్టానం డిమాండ్ చేసింది.