YS Jagan : అచ్యుతాపురం సెజ్ ప్రమాదం.. రేపు ఘటనాస్థలానికి వైఎస్ జగన్
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనాస్థలాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సందర్శించనున్నారు.
తాడేపల్లి : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనాస్థలాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సందర్శించనున్నారు. నేడు ప్రమాదస్థలానికి ముఖ్యమంత్రి వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్ రేపు వెళ్లనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో మాట్లాడి జగన్ వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.
వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. గాయపడి చికిత్సపొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని, వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. ఫార్మా కంపెనీలో రియాక్టర్ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపి మళ్లీ అలాంటి ఘటనలు జరక్కుండా గట్టిచర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.