CM Revanth Reddy : వైఎస్‌తో ఉన్న అనుభవాన్ని పంచుకున్న రేవంత్ రెడ్డి

వైఎస్ రాజశేఖరరెడ్డి మన నుంచి దూరమైనా.. 15ఏళ్లుగా ఆయన్ను గుర్తు చేసుకుంటున్నామ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

By :  Eha Tv
Update: 2024-07-09 04:12 GMT

వైఎస్ రాజశేఖరరెడ్డి మన నుంచి దూరమైనా.. 15ఏళ్లుగా ఆయన్ను గుర్తు చేసుకుంటున్నామ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళగిరిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారన్నారు. వైఎస్ఆర్ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

ఏపీ, తెలంగాణలో వైఎస్ కు లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. వైఎస్ తో నాకు ప్రత్యేకమైన అనుభవం ఉందన్నారు. మొదటిసారిగా నేను శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్లినప్పుడు.. వైఎస్ దృష్టిని ఆకర్షించేలా మాట్లాడాలని చాలా ప్రిపేర్ అయి వెళ్లేవాన్ని.. నేను లేవనెత్తిన అంశాలపై నన్ను ప్రోత్సహించేందుకు ఆయన లేచి సమాధానం ఇచ్చేవారన్నారు. కొత్త వారిని ప్రోత్సహిస్తే నాయకత్వం బలపడుతుందని వైఎస్ నమ్మేవారని.. ప్రతిపక్ష సభ్యులను గౌరవించడం వైఎస్ఆర్ నుంచి నేర్చుకోవాలన్నారు.

రాహుల్ గాంధీ జోడో యాత్ర స్పూర్తితో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ సమర్ధవంతంగా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే మాట.. మాట తప్పను.. మడమ తిప్పను అనే మాట.. ప్రతీ పోరాటానికి ఒక సమయం వస్తుంది.. ప్రజలు ఆదరిస్తారన్నారు. 1999లో వైఎస్ పోషించిన పాత్రను ఇప్పుడు షర్మిల పోషిస్తున్నారని అన్నారు.

ప్రజల గొంతుకై షర్మిల ప్రజల తరపున మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది.. బీజేపీ అంటే బాబు జగన్ పవన్.. అని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు.. అంతా పాలకపక్షమే.. బాబు.. జగన్.. పవన్ అందరూ మోదీ పక్షమేన‌న్నారు. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే నాయకురాలు షర్మిల మాత్ర‌మే అన్నారు. 2029లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.

వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వారే ఆయన నిజమైన వారసులన్నారు. వైఎస్ పేరుతో రాజకీయ వ్యాపారాలు చేసేవాళ్లు ఆయన వారసులు కాదన్నారు. వైఎస్ఆర్ ఆశయాలు కొనసాగించేందుకు షర్మిల ముళ్ల బాటను ఎంచుకున్నారు. షర్మిలకు మేమంతా అండగా నిలబడతామని చెప్పేందుకే మంత్రివర్గ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చాము. కడప పార్లమెంట్ కు ఉప ఎన్నిక వస్తుందని కొందరు మాట్లాడుకుంటున్నారు. నిజంగా కడప పౌరుషాన్ని ఢిల్లీకి చాటే అవకాశం వస్తే.. ఎన్నికల ప్రచారంలో గల్లీ గల్లీ తిరగడానికి నేను వస్తాన‌న్నారు. 

Tags:    

Similar News