US Tariffs Hit Andhra Aquaculture : ఆక్వా రైతులకు ట్రంప్ దెబ్బ.. యూఎస్‌కు నిలిచిపోయిన రొయ్యల ఎగుమతి..!
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన తర్వాత, భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు (టారిఫ్స్) విధించే ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన తర్వాత, భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు (టారిఫ్స్) విధించే ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ట్రంప్ ప్రభుత్వం భారతదేశం నుంచి వచ్చే రొయ్యలపై 26% సుంకం విధించారు. ఈ సుంకం కారణంగా అమెరికా మార్కెట్‌లో భారతీయ రొయ్యల ధరలు పెరిగి, డిమాండ్ తగ్గుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు, వ్యాపారులకు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్. గత ఆర్థిక సంవత్సరంలో (2024), భారతదేశం నుంచి అమెరికాకు సుమారు $1.5 బిలియన్ విలువైన రొయ్యలు ఎగుమతి అయ్యాయి, ఇందులో ఎక్కువ భాగం ఏపీ నుంచే వెళ్లింది. ఈ కొత్త సుంకంతో రొయ్యల ధరలు రెండు రోజుల్లోనే రూ. 40 వరకు తగ్గాయని, దీనివల్ల ఆక్వా సాగుదారులు తీవ్ర ఆందోళనలో పడుతున్నారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో స్థానిక మార్కెట్‌లో ధరలు పడిపోతున్నాయి, ఇది వ్యాపారులకు భారీ నష్టాలను మిగుల్చుతోంది. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రొయ్యల సాగు ప్రధాన ఆదాయ వనరు. ఈ సుంకం వల్ల ఎగుమతులు తగ్గితే, వేలాది మంది రైతులు, వ్యాపారులు ఆర్థిక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిస్థితి తాత్కాలికంగా ఉండొచ్చు, కానీ దీర్ఘకాలంలో అమెరికా వినియోగదారులపైనే భారం పడుతుంది. అయితే, ప్రస్తుతానికి ఏపీ వ్యాపారులు ఇతర మార్కెట్లను యూరప్, జపాన్‌ను ఆశ్రయించాలా లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఒప్పందాలు కుదుర్చుకోవాలా అనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే "4 వేల రొయ్యల కంటెయినర్లు ఎగుమతి కాకుండా ఆగిపోయాని సమాచారం ఉంది. డొనాల్డ్ ట్రంప్ విధించిన 26% సుంకం కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు రొయ్యల ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని సమాచారం. ఎగుమతులు ఆగిపోవడంతో చాలా కంటెయినర్లు పోర్టుల్లోనే నిలిచిపోయాయని, దీనివల్ల రైతులు, వ్యాపారులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. ఏపీ నుంచి ఎగుమతులు ఆగిపోవడంతో కోల్డ్ స్టోరేజీలు నిండిపోయాయని, ఎగుమతిదారులు కొనుగోళ్లు నిలిపివేశారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికాతో చర్చలు జరుపుతున్నాయని, సుంకం మినహాయింపు కోసం ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది.
