Pawan Kalyan : నల్లమల శివ, చిగుళ్ళ మల్లికార్జున్ ల మాటలు కదిలించాయి

అడవిలో ఉండే పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయి.. తద్వారా పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

By :  Eha Tv
Update: 2024-07-30 01:30 GMT

అడవిలో ఉండే పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయి.. తద్వారా పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గ్లోబల్ టైగర్ డే సందర్భంగా సోమవారం మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో పులుల సంరక్షణ గురించి చెబుతూ నల్లమల అడవుల్లో చెంచులు టైగర్ ట్రాకర్స్ గా ఉన్నారనీ, అక్కడ వన్యప్రాణుల సమాచారం అందించడంతోపాటూ అక్రమాలు జరగకుండా నిఘా ఉంచుతారని ఆనందం కలిగించింది. పులులు వారి సంస్కృతిలో అంతర్భాగం అని చెప్పిన మాటలు స్ఫూర్తి కలిగించాయి. కొన్ని సంవత్సరాల కిందట- నల్లమల ప్రాంతానికి చెందిన చెంచు జాతికి చెందిన 16 ఏళ్ల శివ అన్న కుర్రాడు హైదరాబాద్ లో మా ఆఫీస్ దగ్గరకి వచ్చాడు. అతనితో మాట్లాడినప్పుడు పర్యావరణ పరిరక్షణ మీద చెంచులకి ఉన్న నిబద్దత తెలిసింది. అతను నా దగ్గరకు వచ్చిన పని నల్లమలలో యురేనియం మైనింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే మా అడవులు పోతాయి. పులులు చచ్చిపోతాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. నల్లమల విధ్వంసానికి గురవుతుంది. నా మాట ఎవరు వింటారో తెలియక మీ దగ్గరకు వచ్చాను. ఏమైనా చేయమని అడిగాడు. ఆ క్రమంలో కాంగ్రెన్ నాయకులు శ్రీ వి. హనుమంతరావు గారికి చెప్పి నల్లమలలో యురేనియం అన్వేషణపై అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము. ఆ సమావేశంలో చిగుళ్ల మల్లికార్జున్ అనే చెంచుల ప్రతినిధి మాట్లాడిన మాటలు నన్ను కదిలించాయి. ‘నల్లమలలో ఉన్న చెట్లు, జంతువులు, వాగులు అన్నింటినీ మేము దేవతలుగా కొలుస్తాం. పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవర, ఎలుగుబంటిని లింగమయ్యగా చూస్తాం. అడవి పందిని గూబల మస్సి, గారెల మస్సి, బంగారు మైసమ్మ అని పిలుచుకుంటాం. రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా బవరమ్మగా కొలుస్తాము. తేనెలో ఉండే తెల్లగడ్డను మల్లమ్మ అంటాం’ అని అక్కడ తమ ఆచార వ్యవహారాలను, జీవితాన్ని వివరించారు. 

Tags:    

Similar News