Andhra Pradesh : త్వరలో రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు

ల్యాండ్ గ్రాబింగ్ నియంత్రణకు గుజరాత్ తరహా చట్టాన్ని అధ్యయనం చేస్తున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

By :  Eha Tv
Update: 2024-07-29 14:39 GMT

ల్యాండ్ గ్రాబింగ్ నియంత్రణకు గుజరాత్ తరహా చట్టాన్ని అధ్యయనం చేస్తున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. త్వరలో రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందించడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ పొలం వివరాలతో పాటు ఆ పొలానికి దారి చూపే విధానం తెస్తామని చెప్పారు. గత సియం జగన్ పొటోతో పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు 13 కోట్ల రూపాయ‌లు ఖర్చు చేశారని.. ఆ నిధులతో రెవెన్యూ శాఖలో అనేక మార్పులు, సంస్కరణలు తేవచ్చని అన్నారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు, దస్త్రాల దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని మంత్రి స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించి మదనపల్లి సంఘటనలో బాధ్యులపై చర్యలు, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, రెవెన్యూ శాఖలో ప్రక్షాళన ఆవశ్యకత, అసైండ్ భూములు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారని చెప్పారు.

అనంతరం సచివాలయం నాల్గవ భవనంలో మంత్రి సత్యప్రసాద్ మీడియా సమావేశంలో ఆవివరాలను వెల్లడించారు. మదనపల్లి సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాను మూడు రోజుల పాటు అక్కడే ఉంచి పూర్తి స్థాయి విచారణ చేయించగా ఆయన విచారణ నివేదికను సోమవారం ప్రభుత్వానికి సమర్పించారని చెప్పారు. ఈసంఘటనకు సంబంధించి ఇప్పటికే గత ఆర్డీఓ సహా ప్రస్తుత ఆర్డీఓను,ఒక సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. ఈసంఘటన విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్ల జరిగింది కాదని కుట్రపూర్వకంగానే జరిగిందని ఇప్పటి వరకూ జరిగిన విచారణను బట్టి తెలుస్తోందని, ఇంకా పూర్తి విచారణ జరుగుతోందని దీనితో సంబంధం ఉన్న ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ పునరుద్ఘా టించారు.

Tags:    

Similar News