Name Change: ఆ పేర్లను మారుస్తున్నాం: ఏపీ ప్రభుత్వం
ఆ పేర్లను మారుస్తున్నాం
గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లను మారుస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. జగన్ పేరు మీద పథకాలకు భరతమాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో నూతన పథకాల పేర్లు ప్రకటిస్తున్నామన్నారు. జగనన్న అమ్మఒడి పథకం పేరును.. తల్లికి వందనంగా మార్చామని, జగనన్న విద్యాకానుక పేరు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’గా జగనన్న గోరు ముద్ద పేరు ‘ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా, మన బడి నాడు-నేడు పేరును ‘ మనబడి- మన భవిష్యత్తు’గా మార్చామని చెప్పారు. స్వేచ్ఛ పథకం పేరును ‘బాలికా రక్ష’గా.. జగనన్న ఆణిముత్యాలు పేరును ‘అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చినట్లు తెలిపారు. అందుకు సంబంధించి ట్విట్టర్ లో నారా లోకేష్ పోస్టు పెట్టారు.