Speaker Ayyanna Patrudu : ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను 9 నెలల్లో పూర్తి చేయాలి

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ భవనాలను 9 నెలల కాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఆర్డిఏ అధికారులను కోరారు.

By :  Eha Tv
Update: 2024-07-06 03:40 GMT

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ భవనాలను 9 నెలల కాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఆర్డిఏ అధికారులను కోరారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సిఆర్డిఏ, అసెంబ్లీ అధికారులతో అసెంబ్లీ భవనం, ఆప్రాంగణంలో మీడియా పాయింట్ తోకూడిన అనెక్సా భవనం నిర్వహణ, రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల భవన సముదాయాలపై ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల భవనాలను ఎట్టి పరిస్థితుల్లోను 9 మాసాల్లోగా పూర్తి చేసి ఇవ్వాలని సిఆర్డిఏ అధికారులను కోరారు.

ఒక నిర్ధిష్ట కాలవ్యవధి ప్రకారం పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఎంఎల్ఏ,ఎంఎల్సిల నివాస భవన సముదాయాలతో పాటు ఇతర భవనాలు,పనులు ఎక్కడివి అక్కడే నిలిచి పోవడంతో వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా తుప్పు పట్టిపోయే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.అంతేగాక వాటిని పూర్తి చేసేందుకు అయ్యే అంచనా వ్యయం కూడా పెరిగి పోయిందని స్పీకర్ అయన్న పాత్రుడు పేర్కొన్నారు.

అసెంబ్లీ భవనంలో లీకేజీలు ఉన్నట్టు గుర్తించామని వాటిని వెంటనే అరికట్టాలని శాసన సభాపతి సిహెచ్.అయ్యన్న పాత్రుడు సిఆర్డిఏ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రస్తుతం మీడియా పాయింట్ ఉన్న ఎనెక్సా భవనంలో కూడా సౌకర్యాలను మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించిన ప్రత్యేక గ్రంధాలయన్ని అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆదిశగా తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పిపికె రామాచార్యులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. అంతేగాక వివిధ అసెంబ్లీ కమిటీల చైర్మెన్ లకు కూడా ఈభవనంలో రూమ్ లను ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీకి వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా చిన్న క్యాంటీన్ ను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులకు సూచించారు.

Tags:    

Similar News