Deputy CM Pawan Kalyan : తొలి రోజే ఆ శాఖ‌ల‌పై ఆరు గంటలపాటు సమీక్షలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు.

By :  Eha Tv
Update: 2024-06-20 05:01 GMT

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలు నిర్వర్తిస్తారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయ‌న‌ శాఖాపరమైన సమీక్షలు ప్రారంభించారు. తొలి రోజే శాఖలపై లోతుగా సమీక్ష చేపట్టారు. సుమారు ఆరు గంటలపాటు సంబంధిత శాఖలపై సమీక్షలు నిర్వహించారు. ప్రతి అంశాన్నీ కూలంకషంగా తెలుసుకున్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

తొలుత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన పథకాలు, వాటి పురోగతి, శాఖాపరమైన కార్యకలాపాలను ఉన్నతాధికారులు వివరించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ సమీక్షలో శాఖలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ శాఖల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యాన వన సంబంధిత పనులకు నిధులను పెంపుదల చేయడం కూడా అటు రైతులు, ఇటు ఉపాధి హామీ కూలీలకు భరోసా కల్పించడంలో భాగమే అని తెలిపారు. గురువారం ఈ శాఖలకు సంబంధించిన సోషల్ ఆడిట్, ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్షిస్తారు.

పచ్చదనం పెంపు.. అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి

సాయంత్రం అటవీ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ శాఖ కార్యకలాపాలను, అటవీ పరిరక్షణ అంశాలు, కాలుష్య నియంత్రణ, పర్యావరణ సంబంధిత విషయాలపై ఉన్నతాధికారులతో సమగ్రంగా చర్చించారు. సామాజిక వనాలు, నగర వనాలు పెంపు, జీవ వైవిధ్య మండలి కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. మడ అడవుల పరిరక్షణ, వాటిని పెంచడంపై చర్చించారు. పచ్చదనం పెంచడం, అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు.

Tags:    

Similar News