CM Chandrababu : మద్యం పాలసీని మార్చడం వల్ల ప్రభుత్వానికి రూ.18,860 కోట్లు నష్టం

వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలను పూర్తి స్థాయిలో వెలికితీసేందుకు సీఐడీకి అప్పగిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు

By :  Eha Tv
Update: 2024-07-25 01:41 GMT

వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలను పూర్తి స్థాయిలో వెలికితీసేందుకు సీఐడీకి అప్పగిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. ఆన్ లైన్ లావాదేవీలు లేకుండా నగదు రూపంలో అమ్మకాలు సాగించినందున ఈడీ సపోర్టు కూడా తీసుకుంటామ‌ని తెలిపారు. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీని మార్చడం వల్ల ప్రభుత్వానికి రూ.18,860.51 కోట్ల నష్టం వాటిల్లింది. రాష్ట్ర ఆదాయానికి గండికొట్టినందున తప్పకుండా చర్యలు ఉంటాయి. నాసిరకం మద్యం సేవించి ఎంతమంది అనారోగ్యం పాలయ్యారో ఆరోగ్య శాఖ నుండి వివరాలు సేకరిస్తాం.’’ అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో బుధవారం ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు.

ఈ సందర్భంగా సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా భయకరంగా ఉంది...ఇంకా లోతుల్లోకి వెళ్లి పరిశీలించాల్సి ఉంది. బాగోలేని ఆర్థిక పరిస్థితి వల్ల పూర్తి స్థాయి బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. కేంద్రం ఇచ్చిన వెసులు బాటు తాత్కాలికం. రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకోగలిగితేనే శాశ్వత వెసులుబాటు లభిస్తుంది. గత ఐదేళ్లు రాష్ట్రంలో ఏం జరిగింది.. ఎంత నష్టం జరిగింది, కోలుకోలేని దెబ్బ ఏ విధంగా తగిలిందో వివరించడానికే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామ‌ని తెలిపారు. పోలవరం, అమరావతి, విద్యుత్, సహజ వనరుల దోపిడీపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేశాం. ప్రజలకు జావాబుదారీతనంగా ఉండాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామ‌న్నారు. సంక్షేమం, అభివృద్ధి సమతుల్యతతో సంపద సృష్టించాల్సి ఉంది. కానీ ఐదేళ్ల పాటు జరిగిన విధ్వంసంతో 25 ఏళ్ల‌కు కూడా కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన ఒక కేస్ స్టడీ అన్నారు. పాలకుడు ఎలా ఉండకూడదో జగన్ కేస్ స్టడీగా ఉన్నారని అన్నారు. తక్షణ అవసరాల కోసం కొందరు తప్పులు చేస్తారు.. కొంత మంది అత్యాశతో తప్పులు చేస్తారు. ఉన్మాదంతో మరికొంత మంది తప్పులు చేస్తారు.. గత ఐదేళ్లు కేవలం ఉన్మాదంతో డబ్బు కోసం మాత్రమే తప్పులు చేశారు. ప్రజలు ఏమైనా పర్వాలేదు అన్న ఉద్దేశంతో వ్యవహరించారు.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News