విశాఖ మధురవాడలో నిండు గర్భిణీని చంపేశాడు కసాయి భర్త.

విశాఖ మధురవాడలో నిండు గర్భిణీని చంపేశాడు కసాయి భర్త. విశాఖ జిల్లాకు చెందిన గెద్దాడ జ్ఞానేశ్వరరావు(Jnaneshwar Rao), అనూష (K Anusha)రెండేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ ఒంటరిగా మధురవాడ పీఎంపాలెం(PM Palem ) ఊడా కాలనీలో నివాసం ఉంటున్నారు. స్కౌట్స్, సాగర్ నగర్ వ్యూ పాయింట్ వద్ద జ్ఞానేశ్వర్ రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనూష గర్భం దాల్చింది. ఆమె ప్రసవించేందుకు కేవలం 24 గంటలే సమయం ఉంది. అయితే కొంతకాలంగా వారిద్దరి మధ్య కొన్ని నెలలుగా మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో అప్పుడప్పుడూ గొడవపడేవాడు. అయితే సోమవారం ఉదయం సైతం వారి మధ్య వివాదం తలెత్తింది. అది కాస్త ఘర్షణకు దారి తీసింది. గర్భిణీ అనే విషయం మర్చిపోయి విచక్షణారహితంగా ప్రవర్తించాడు జ్ఞానేశ్వర్. ఆమె గొంతు నులిమి అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తన బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి అనూషకు ఆరోగ్యం బాగోలేదని చెప్పాడు. వెంటనే రావాలని కోరాడు. దీంతో హుటాహుటిన వారందరూ అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆ యువతి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. దీంతో అనూష మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. విషయం కాస్త అనూష తల్లిదండ్రులకు చేరింది. ఆస్పత్రి వద్దకు వచ్చిన యువతి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అనూషను తానే గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

ehatv

ehatv

Next Story