CM Chandrababu : మైనింగ్ శాఖలో అక్రమాలను పూర్తిగా తవ్వితీయండి

మైనింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై సమీక్షించారు.

By :  Eha Tv
Update: 2024-08-01 03:19 GMT

మైనింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై సమీక్షించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014-19 మధ్య 24 శాతం వృద్ధి సాధించగా.. 2019-24 మధ్య 7 శాతానికి పడిపోయిందని అధికారులు వివరించారు. గ‌త‌ ప్రభుత్వంలో రూ.9,750 కోట్ల ఆదాయం నష్టపోయిందని వివరించారు. 5 ఏళ్ల కాలంలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగిన నష్టంపైనా సీఎం సమీక్షించారు. ఇసుక తవ్వకాల్లో ఒప్పందాల ప్రకారం ప్రైవేటు ఏజెన్సీలు ప్రభుత్వానికి రూ.1,025 కోట్లు చెల్లించలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కేసులు నమోదు చేశామని అన్నారు. మైనింగ్ లో గత ప్రభుత్వ అక్రమాలను పూర్తిగా తవ్వితీయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇసుక, సిలికా, క్వార్జ్ట్ తవ్వకాల్లో అక్రమాలపై ఆధారాలు పక్కాగా సేకరించాలని సూచించారు.

ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తవ్వకం, సీనరేజ్, రవాణా చార్జీలు చెల్లించి ఇసుక తీసుకెళ్లొచ్చనేదే తమ విధానమని పేర్కొన్నారు. రవాణా ఖర్చుల కారణంగా కొన్ని చోట్ల అనుకున్నంత తక్కువ మొత్తానికి ఇసుక దొరకని అంశంపైనా సీఎం ప్రత్యేకంగా చర్చించారు. తవ్వకం, రవాణా ఖర్చులు భారం కాకుండా కొత్తగా ఏయే విధానాలు అవలంభించవచ్చు అనే అంశంపై అధికారులతో చర్చించారు. రీచ్ నుంచే నేరుగా అవసరం ఉన్నవారికి ఇసుక తీసుకువెళ్లగలిగితే భారం ఉండదని అన్నారు. కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలతో రావాలని అధికారులకు సూచించారు. ఇసుక వినియోగదారులకు భారం కాకుండా చూడాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది ద్వారా ఇసుక పాలసీ అమలుపై ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. ప్రభుత్వం ఇసుక నుంచి ఎటువంటి ఆదాయం ఆశించడం లేదని....అక్రమాలు జరగకుండా వినియోగదారులకు ఇసుక చేర్చేందుకు అవసరమైన మెకానిజం చూడడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా సామాన్యుల ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు కలిగించవద్దు సూచించారు. 

Tags:    

Similar News