Central Government: నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం
రాష్ట్రానికి కేంద్ర బృందం
By : Sreedhar Rao
Update: 2024-09-05 04:48 GMT
ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 32కి పెరిగిందని, సహాయక శిబిరాల్లో ఉన్న వారి సంఖ్య 45,369కి చేరుకుందని అధికారులు తెలిపారు. విజయవాడలో అత్యధికంగా ప్రభావితమైన ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మరణించారు. వరద బీభత్సానికి గురైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలను గురువారం కేంద్ర ప్రభుత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖల బృందం సందర్శించి బాధితులతో సంభాషించనుంది. కేంద్ర బృందంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు కేపీ సింగ్, సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ సిద్దార్థ్ మిత్ర ఉంటారని ఒక ప్రకటనలో తేలింది.
రానున్న రోజుల్లో ఏపీలో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. "సెప్టెంబర్ 5 నాటికి పశ్చిమ-మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది" అని వాతావరణ శాఖ ప్రకటనలో తెలిపింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.