Andhra Pradesh : ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. వారికి వేతనం పెంపు

రాష్ట్రంలోని దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరవాలని, అపచారాలకు చోటు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు

Update: 2024-08-28 02:12 GMT

రాష్ట్రంలోని దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరవాలని, అపచారాలకు చోటు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భక్తులు ప్రశాంతత కోసం, తమ బాధలు దేవుడితో చెప్పుకోవడం కోసం గుళ్లకు వస్తారని.. అలాంటి వారికి మంచి దర్శనం, చక్కటి వాతారణం కల్పించాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు. దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ కుటుంబమైనా పుణ్యక్షేత్రానికి వస్తే ఒకటి రెండు రోజులు అక్కడ ఉండే వాతావరణం కల్పించాలని అన్నారు.

దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిడులు ఉండకూడదని.. ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. పటిష్టమైన చర్యల ద్వారా బలవంతపు మత మార్పిడులను అడ్డుకోవచ్చని అన్నారు. అదే విధంగా దేవాలయాల్లో అన్యమతస్థులు ఉండకూడదని చెప్పారు . ఏ మతంలో అయినా భక్తుల మనోభావాల ముఖ్యమని సిఎం అన్నారు. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా దేవాదాయ శాఖ అధికారులు పనిచేయాలని సిఎం సూచించారు. సులభతర దర్శనం, దేవాలయాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలు, బస చేయడానికి అనువైన కాటేజ్ లు, గదులు ఉండాలని అన్నారు. భక్తుల జేబులు ఖాళీ చేసే విధంగా కాకుండా, భక్తులు ఇష్టంగా అక్కడ గడిపే పరిస్థితి కల్పించాలని అన్నారు. టెంపుల్ టూరిజంకు మన దగ్గర అనేక అవకాశాలు ఉన్నాయని.. వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలతో రావాలని సిఎం కోరారు. రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటు కు నిర్ణయం తీసుకున్నారు. దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో అదనంగా మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. రూ. 20 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 15 మంది బోర్డు సభ్యులుగా ఉంటారు. దీన్ని 17కు పెంచనున్నారు. ఇలా అన్ని ట్రస్ట్ బోర్డులలో ఇద్దరు చొప్పున అదనంగా సభ్యులను సంఖ్యను పెంచనున్నారు. ట్రస్ట్ బోర్డులో ఒక బ్రాహ్మణుడు, ఒక నాయీ బ్రాహ్మణుడు తప్పకుండా ఉండేలా చూస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు సభ్యుల సంఖ్యను పెంచి వారికి అవకాశం కల్పించనున్నారు. అదేవిధంగా రూ. 10 వేలు వేతనం పొందే అర్చకులకు ఇకపై రూ. 15 వేలు ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం ద్వారా 1683 మంది లబ్ధి పొందనున్నారు. దీని వల్ల ప్రభుత్వం పై ఏటా రూ. 10 కోట్ల భారం పడుతుంది. అదేవిధంగా దూపదీప నైవేద్యాలకు దేవాలయాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ సిఎం నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఏడాదికి రూ. 32 కోట్ల అదనపు భారం పడుతుంది. వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ. 3 వేలు భృతి ఇవ్వాలని సిఎం సూచించారు. నాయీ బ్రాహ్మణులకు కనీసం వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజును దేవాదాయ శాఖపరంగా గుర్తించి నిర్వహించేందుకు సిఎం నిర్ణయం తీసుకున్నారు. ఆర్యవైశ్య సంఘాల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పరంగా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

సిజిఎఫ్ క్రింద, శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా గత ప్రభుత్వం కొన్ని పనుల ప్రతిపాదించింది అయితే అందులో కొన్ని పట్టాలెక్కగా...కొన్ని పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికే మొదలైన పనులను పూర్తి చెయ్యాలని సిఎం సూచించారు. ఇదే సందర్భంలో ప్రారంభం కాని పనులను నిలిపివేసి మరో సారి వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. సిజిఎఫ్ క్రింద 243 పనులు ప్రారంభం కాలేదు. అలాగే టిటిడి శ్రీవాణి ట్రస్ట్ కింద వివిధ ప్రాంతాల్లో తలపెట్టిన 1797 దేవాలయాల పనులు ప్రారంభం కాలేదు. వీటిని నిలిపివేయాలని సిఎం ఆదేశించారు. శ్రీవాణి ట్రస్ట్ కింద చేపట్టే దేవాలయాలు, ఇతర నిర్మాణాల పై చర్చించి...అవసరం అయితే వాటికి కేటాయించే నిధులు పెంచి పనులు ప్రారంభిద్దాం అని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో పల్లెల్లో, వాడల్లో శ్రీవాణి ఆలయ నిర్మాణం ట్రస్ట్ ద్వారా రూ. 10 లక్షలు ఇచ్చేవారు. వీటితో ఆలయాల నిర్మాణాలు సాధ్యం కావడం లేదని అధికారులు వివరించారు. దీంతో ఈ మొత్తాన్ని పెంచడానికి, రెట్టింపు చేసి ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిఎం సూచించారు. ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో దేవాలయం ఉండేలా చూడాలన్నారు. అదే సమయంలో శ్రీవారి నిధులు ఖర్చుకు జవాబుదారీగా కూడా ఉండాలని సిఎం అన్నారు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీల ఏర్పాటు చేయాలని కూడా సమీక్షలో సిఎం అధికారులకు ఆదేశించారు. గోదావరీ, కృష్ణా నదీ హారతులు మళ్లీ నిర్వహించాలని సిఎం సూచించారు. ప్రతి దేవాలయంలో ఆన్ లైన్ విధానం అమలు చేయాలని, అన్ని సర్వీసులు ఆన్ లైన్ ద్వారా అందాలని సీఎం అన్నారు. గుడికి వచ్చే భక్తులు దర్శనం చేసుకుని వెళ్లడమే కాకుండా ప్రత్యేక పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని అన్నారు. అవసరం అయితే ప్రైవేటు సెక్టార్ భాగస్వామ్యంతో హోటళ్ల నిర్మాణం చేపట్టి భక్తులకు వసతులు కల్పించాలని సీఎం అన్నారు. ధనికులే కాకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా బస చేసే పరిస్థితి ఉండాలని సీఎం అన్నారు. దేవాలయాలకు విరాళాలు ఇచ్చిన వారిని ప్రోత్సహించండి.. వారి పేర్లు ప్రకటించండి అని అధికారులకు సూచించారు. గతంలో దేవాలయాల్లో జరిగిన పలు ఘటనలపై లోతుగా విచారణ జరపాలని అన్నారు. రానున్న రోజుల్లో దేవాలయాల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని సిఎం అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News