పోలవరం(Polavaram)... ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయపార్టీల నేతలందరూ పోలవరంపై హీరో వర్షిప్‌ను చూపిస్తూ ఉంటారు.

పోలవరం(Polavaram)... ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయపార్టీల నేతలందరూ పోలవరంపై హీరో వర్షిప్‌ను చూపిస్తూ ఉంటారు. పోలవరం ప్రాజెక్టు తమ వల్లే సాధ్యమవుతుందని, తామే నిర్మిస్తామని ప్రతీ ఒక్కరు చెప్పుకుంటుంటారు. అలాగే అధికారంలో ఉన్నవారు పాత ప్రభుత్వాలపై నిందలు వేస్తుంటారు. పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారని, పైసా కూడా ఖర్చు పెట్టలేదని చెబుతూ ఉంటారు. దశాబ్దాల కాలంగా ఇలాంటి తంతును చూస్తూ వస్తున్నాం.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) అసెంబ్లీలో చేసిన ప్రకటన కూడా ఈ బాపతు కిందకే వస్తుంది. పోలవరం పూర్తి కాకపోవడానికి గత ప్రభుత్వాలు కారణమన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి(Rajashekar reddy) ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో పోలవరాన్ని పట్టించుకోలేదని, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి(YS Jagan ) హయాంలో పోలవరం పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యిందని చంద్రబాబు శాసనసభలో చెప్పారు. గతంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీ(TDP) అధికారంలో ఉంది. అంటే అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయే పాలనే ఉండింది. 2014 నుంచి 2018 వరకు బీజేపీ, టీడీపీ కలిసే ఉన్నాయి. ఆ సమయంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ తామే కట్టుకుంటామని చంద్రబాబు అన్నారు. తాము కట్టి బిల్స్‌ పెడతాం. వాటికి చెల్లింపులు చేయండి అని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు. మీరు కడితే ఆలస్యం అవుతుందని, తాము అయితే త్వరగా ప్రాజెక్టును కంప్లీట్‌ చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తీసుకుని కొంతమంది కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే పీపీఏ చెప్పిన నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నాశనమయ్యిందని, ఇప్పుడు దీనిని పూర్తి చేయాలంటే నాలుగేళ్లు పడుతుందో, అయిదేళ్లు పడుతుందో తెలియడం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించి వచ్చారు. 2014 నుంచి 2019 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ సోమవారం పోలవరం ప్రాజెక్టును రివ్యూ చేస్తానని చెప్పుకొచ్చారు. అలా ప్రతీ సోమవారం రివ్యూలు చేస్తూ వచ్చినప్పటికీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా పోలవరంపై సాకులు చెప్పింది. తెలుగుదేశం ప్రభుత్వం ఓ ప్రణాళిక అంటూ లేకుండా పోలవరాన్నినాశనం చేసిందని, డయాఫ్రం వాల్‌ నిర్మాణం నాసిరకంగా ఉందని, ముందు కట్టాల్సింది వెనకాతల, వెనక కట్టాల్సింది ముందుగా కట్టేసి అస్తవ్యస్తం చేసిందని జగన్‌ ప్రభుత్వం ఆరోపించింది. వర్తమానానికి వస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వీలైనంత త్వరగా పోలవరాన్ని నిర్మిస్తామని మరోసారి మాట ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిపై కొన్నిఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ ఇమ్మిడియట్‌గా రియాక్టవ్వాల్సి ఉంది. పోనీ ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉన్న షర్మిల అయినా రియాక్టవ్వాలి. వీరిద్దరు స్పందించలేదు కానీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆత్మగా పది మంది చెబుతున్న, వైఎస్‌కు సన్నిహితుడిగా ఉన్న కాంగ్రెస్‌ నాయకుడు కేవీపీ రామచంద్రరావు నేరుగా చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. వైఎస్‌పై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు.


Updated On 21 Nov 2024 10:37 AM GMT
Eha Tv

Eha Tv

Next Story