Union Minister : 2026 నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ‌ కోసం రూ.700 కోట్లతో మొద‌లుపెట్టిన‌ ప్రాజెక్టు 2026 నాటికి పూర్తవుతుందని.. ఇప్పటికే 27% పనులు పూర్తయ్యాయని రైల్వే, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు తెలిపారు

Update: 2024-08-25 07:14 GMT

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ‌ కోసం రూ.700 కోట్లతో మొద‌లుపెట్టిన‌ ప్రాజెక్టు 2026 నాటికి పూర్తవుతుందని.. ఇప్పటికే 27% పనులు పూర్తయ్యాయని రైల్వే, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు తెలిపారు. రైల్వే స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఎయిర్‌పోర్టు ప్రమాణాల తరహాలో సంప్రదాయ అంశాలను సమకాలీన ఆర్కిటెక్చర్‌తో కూడిన ఆధునిక డిజైన్‌తో రూపొందించామన్నారు. రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో విశాలమైన రూఫ్ ప్లాజా, ఫలహారశాలలు, వినోద ప్రదేశాలు, స్థానిక ఉత్పత్తులపై దృష్టి సారించే రిటైల్ దుకాణాలు ఉంటాయన్నారు.

స్టేషన్‌లో నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, సోలార్ ప్యానెల్‌లు కలుపుకొని గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్‌లను ఉపయోగించుకుంటుందన్నారు. రాబోయే 50 సంవత్సరాలకు ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా డిజైన్ రూపొందించబడిందని పేర్కొన్నారు.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 119 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వే (SCR)కి రూ. 5,000 కోట్లకు పైగా కేటాయించింది. దీంతో జంట నగరాల ప‌రిధిలోని నాలుగు ప్రధాన రైల్వే టెర్మినల్స్‌లో గణనీయమైన మార్పులు జరగనున్నాయి, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు చివరి దశలో ఉన్నాయని ఒక పత్రికా ప్రకటన తెలియజేసింది.

Tags:    

Similar News