ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.

ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్వేర్ ఇంజినీర్లు దుర్మరణం చెందారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన భాను ప్రకాశ్ (36), నళినికంఠ బిస్వాల్ (37)లు స్నేహితులు. వీరు తమ కుటుంబాలతో కలిసి రాజేంద్రనగర్ మంచిరేవులలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మేడ్చల్ నుంచి పటాన్చెరు వైపు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భాను ప్రకాశ్, బిస్వాల్ అక్కడికక్కడే మృతి చెందారు. భాను ప్రకాశ్ భార్య సాయి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తులో ఉన్నారని, అంతేకాకుండా అతివేగం కూడా ఉండడం ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
అయితే ఈ ఇద్దరు చాలా ఏళ్లుగా స్నేహితులు. భానుప్రకాశ్(Bhanu Prakash)(36). శనివారం రాత్రి 8 గంటలకు స్నేహితులిద్దరూ కారులో అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లారు. తిరిగి ఆదివారం ఉదయం మేడ్చల్ నుంచి పటాన్చెరు మీదుగా అవుటర్ రింగ్‌రోడ్డుపై ఇళ్లకు బయల్దేరారు. వేగంగా వెళుతున్న కారు మార్గంమధ్యలో మల్లంపేట 4ఏ ఎగ్జిట్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. పల్టీలు కొట్టి విద్యుత్ స్తంభానికి తగిలి పక్కరోడ్డుపై పడింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కారును భానుప్రకాశ్ నడుపుతున్నట్లు సమాచారం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే నళినికంఠ బిశ్వాల్ ఐఫోన్ ద్వారా అతని భార్య సునైనా మొబైల్‌కు సమాచారాన్ని ఐఫోన్ చేరవేసింది. లొకేషన్ వివరాలు వెళ్లాయి. ఆమె భయపడి అదే అపార్ట్మెంట్లో ఉంటున్న భానుప్రకాశ్ భార్య సాయిలక్ష్మికి విషయాన్ని చెప్పారు. కారులో అక్కడి నుంచి గంటన్నర ప్రయాణించి ఘటనాస్థలికి చేరుకున్నారు. కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఐఫోన్ వాడుతున్న వ్యక్తి ఉంటే.. అత్యవసర నంబర్లకు సమాచారాన్ని చేరవేస్తుంది. కాగా భానుప్రకాశ్, సాయిలక్ష్మి దంపతులకు మూడేళ్ల కూతురు కూడా ఉంది.
