Travis Head Record : తుఫాను ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్‌

ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ విధ్వంస‌క‌ర‌ ఓపెన‌ర్‌ ట్రావిస్ హెడ్ గురువారం తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియాకు తిరుగులేని విజయాన్ని అందించాడు

Update: 2024-09-20 04:24 GMT

ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ విధ్వంస‌క‌ర‌ ఓపెన‌ర్‌ ట్రావిస్ హెడ్ గురువారం తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియాకు తిరుగులేని విజయాన్ని అందించాడు. దీంతో సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియాకు ఇంగ్లండ్ నిర్దేశించిన 316 పరుగుల లక్ష్యాన్ని.. 44 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. ఈ మ్యాచ్‌లో హెడ్ 129 బంతుల్లో 154 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 20 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. వన్డేల్లో హెడ్‌కి ఇదే అత్యుత్తమ స్కోరు. హెడ్ మార్నస్ లాబుషాగ్నేతో కలిసి 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లాబుషాగ్నే 61 బంతులు ఎదుర్కొని 77 పరుగులతో అజేయంగా నిలిచాడు.

హెడ్ ​​తన తుఫాను ఇన్నింగ్స్‌తో ప‌లు రికార్డులను బద్దలు కొట్టాడు. ఇందులో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు కూడా ఉంది. ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్‌పై హెడ్ ఈ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మైదానంలో ఛేదన‌లో ఇంగ్లండ్‌పై అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మెన్‌గా హెడ్ నిలిచాడు. అతనికి ముందు 2018 జూలైలో ఇదే మైదానంలో ఇంగ్లండ్‌పై 137 పరుగులు చేసిన రోహిత్ పేరిట ఈ రికార్డు ఉంది. ఇంగ్లండ్‌లో ఏ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ కైనా ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్. గతంలో ఈ రికార్డు షేన్ వాట్సన్ పేరిట ఉండేది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బెన్ డకెట్, విల్ జాక్వెస్‌ల బలమైన ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు సాధించింది. బెన్ డకెట్ 91 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. విల్ జాక్వెస్ 56 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ జ‌ట్టులో మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. ఆస్ట్రేలియా తరఫున ఆడమ్‌ జంపా, లాబుషాగ్నే చెరో మూడు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో హెడ్ కూడా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీశాడు. హెడ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Tags:    

Similar News