IND vs AUS : ప్రతీకారం తీర్చుకున్న భారత్‌.. సునాయాసంగా సెమీ-ఫైనల్‌కు..

సూపర్ ఎయిట్ దశలో భారత జట్టు అద్భుతంగా రాణించి సునాయాసంగా సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.

By :  Eha Tv
Update: 2024-06-25 02:22 GMT

సూపర్ ఎయిట్ దశలో భారత జట్టు అద్భుతంగా రాణించి సునాయాసంగా సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓట‌మికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఆస్ట్రేలియాకు సెమీ ఫైన‌ల్ ఎంట్రీ చాలా కష్టంగా మారింది.

రోహిత్ శర్మ సూప‌ర్‌ ఇన్నింగ్స్ 92 పరుగుల సాయంతో భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 205 పరుగులు చేసింది, అనంత‌రం ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 181 పరుగులు మాత్రమే చేసి వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.

ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్ 43 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేశాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్‌తో కలిసి రెండో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ ద‌శ‌లో మ్యాచ్ ఆస్ట్రేలియా జట్టు గెలుస్తుందని అనిపించినా భారత బౌలర్లు ధీటుగా పుంజుకుని టోర్నీలో మ‌రో విజయాన్ని సాధించారు. భారత్ తరఫున ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు.

సూపర్ ఎయిట్స్ దశలో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి గ్రూప్ వన్‌లో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మూడు మ్యాచ్‌లు ఆడి రెండు ఓటములు, ఒక విజయంతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్‌లలో ఒక విజయం, ఒక ఓటమితో రెండు పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్థాన్ ఈ ఉదయం బంగ్లాదేశ్‌తో తలపడుతంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధిస్తే సెమీ-ఫైనల్‌కు చేరుకుంటుంది. దీంతో ఆస్ట్రేలియా ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. సెమీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జూన్ 27న గయానాలో జరగనుంది.

Tags:    

Similar News