IND vs SL : మా బలం అదే.. సిరీస్ విజయం వెనక సీక్రెట్ చెప్పిన శ్రీలంక కెప్టెన్
చివరి వన్డేలో భారత్‌పై శ్రీలంక 110 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ని కైవసం చేసుకుంది. శ్రీలంక సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై కెప్టెన్ చరిత అసలంక జట్టును ప్రశంసించాడు.
చివరి వన్డేలో భారత్‌పై శ్రీలంక 110 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ని కైవసం చేసుకుంది. శ్రీలంక సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై కెప్టెన్ చరిత అసలంక జట్టును ప్రశంసించాడు. అలాగే కొత్త కోచ్ సనత్ జయసూర్యపై ప్రశంసలు కురిపించాడు. కుర్రాళ్లు జట్టు వాతావరణాన్ని మార్చేశారని అసలంక అన్నాడు.
శ్రీలంక భారత్‌కు 249 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఛేదనలో భారత్ 26.1 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. భారత్ నుంచి కేవలం నలుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. శ్రీలంక స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా దునిత్ వెల్లాలఘే 5.1 ఓవర్లలో 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ చరిత అసలంక మాట్లాడుతూ.. ప్రస్తుతం కెప్టెన్‌గా సంతోషంగా ఉన్నాను. సిరీస్‌లో జట్టు అంతా సరిగ్గానే చేసింది. టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందని మనందరికీ తెలుసు. మేము మా బలాలపై ఆధారపడాలనుకున్నాము. స్పిన్ మా బలం. దానికే మద్దతు ఇచ్చాము. మా కోచ్‌లు చాలా చురుకుగా ఉన్నారు. అబ్బాయిలు జట్టు వాతావరణాన్ని మార్చేశారని అన్నాడు.
క్లిష్టమైన పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 248 పరుగులు చేసింది. భారత జట్టు 138కి కుప్పకూలింది. ఈ గెలుపుతో 27 ఏళ్ల తర్వాత భారత్‌పై శ్రీలంక సిరీస్ విజయం సాధించింది. శ్రీలంక తరఫున అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59) అద్భుతమైన అర్ధ సెంచరీలు ఆడారు.