Diamond League Final : తృటిలో టైటిల్ కోల్పోయిన నీర‌జ్ చోప్రా.. మ‌ళ్లీ రెండో స్థానమే..

డైమండ్ లీగ్ 2024 టైటిల్ గెలవాలన్న భారత జావెలిన్ త్రో స్టార్ నీర‌జ్ చోప్రా కల నెరవేరలేదు

Update: 2024-09-15 04:00 GMT

డైమండ్ లీగ్ 2024 టైటిల్ గెలవాలన్న భారత జావెలిన్ త్రో స్టార్ నీర‌జ్ చోప్రా కల నెరవేరలేదు. శనివారం బ్రస్సెల్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 87.86 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. కాగా, గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల త్రోతో మొదటి స్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 85.97 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతక విజేత నీరజ్ ఈ లీగ్‌లో రెండో స్థానానికి చేరుకుని ఫైనల్‌లోకి ప్రవేశించాడు. అయితే తృటిలో టైటిల్ మిస్సయ్యాడు.

నీరజ్ తొలి రౌండ్‌లో 86.82 మీటర్లు విసిరి రెండో స్థానానికి చేరుకోగా.. అతడి కంటే ముందు గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 87.87 త్రోతో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

రెండో రౌండ్‌లో నీరజ్ 83.49 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో అండర్సన్ పీటర్స్ రెండవ త్రో 86.96 మీటర్లు విసిరి మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

నీరజ్ మూడో రౌండ్‌లో మంచి పునరాగమనం చేసి 87.86 మీట‌ర్లు విసిరాడు. అండర్సన్ మూడో ప్రయత్నంలో 85.40 మీటర్లు విసిరాడు.

నాలుగో రౌండ్‌లో నీరజ్ చోప్రా 82.04 మీటర్లు విసిరగా.. అండర్సన్ నాలుగో ప్రయత్నంలో 85.85 విసిరి మొదటి స్థానంలో నిలిచాడు.

ఐదో రౌండ్‌లో 83.30 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. అండర్సన్ ఐదో త్రోను 84.11 మీటర్లు విసిరి మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

నీరజ్ ఆరో రౌండ్‌లో పునరాగమనం చేశాడు. అయితే.. 86.46 మీటర్ల త్రో చేసినా అతడి ప్లేస్‌లో ఎలాంటి మార్పు లేదు. రెండో స్థానంలో నిలిచాడు. చివరికి అండర్సన్ మొదటి స్థానంలో నిలిచాడు.

డైమండ్ లీగ్ సీజన్ ఫైనల్ విజేత డైమండ్ ట్రోఫీని, US $ 30,000 (సుమారు రూ. 25 లక్షలు) బహుమతిని అందుకుంటాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ల‌భిస్తుంది. రన్నరప్‌కి US$12,000 (సుమారు రూ. 10 లక్షలు) అందుతుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం తర్వాత పారిస్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ సీజన్‌ను విజయంతో ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 14 పాయింట్లతో 4వ స్థానంతో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అయితే ఇక్కడ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతకుముందు అతడు దోహా, లౌసాన్నెలో రెండవ స్థానంలో నిలిచాడు.  

Tags:    

Similar News