MS Dhoni Is My Guru : ధోనీ నా అన్నయ్య, గురువు.. ఆయ‌నే నా కల నెరవేర్చాడు..!

ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన‌ భారత జట్టు యువ పేసర్ ఖలీల్ అహ్మద్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు

Update: 2024-08-19 08:05 GMT

ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన‌ భారత జట్టు యువ పేసర్ ఖలీల్ అహ్మద్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇదే.. 2024 T20 ప్రపంచ కప్ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక‌య్యేందుకు అహ్మద్ కు ఉప‌యోగ‌ప‌డింది. టీ20 ప్రపంచకప్ సమయంలో అహ్మద్‌కు భారత జట్టులో ఆడే అవకాశం లభించలేదు. అయితే జట్టుతో కలిసి జింబాబ్వే వెళ్లే అవకాశం లభించింది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్‌లోనూ ఖలీల్ అహ్మద్ కు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది.

ఇదిలావుండ‌గా.. ఖలీల్ తన జీవితంలో MS ధోనీ కున్న‌ ప్రాముఖ్యత గురించి ఆకాష్ చోప్రాతో చెప్పాడు. ఎంఎస్ ధోనీ తనకు స్నేహితుడు కాదని.. తన అన్నయ్య, మెంటర్ అని ఖలీల్ వెల్లడించాడు. జాతీయ జట్టు త‌రుపున‌ మొదటి ఓవర్ బౌలింగ్ చేయాలనే తన కల ధోనీ ద్వారా నెరవేరిందని ఖలీల్ చెప్పాడు.


ఖలీల్ అహ్మద్, ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. "మేము న్యూజిలాండ్‌లో ఉన్నాము. మహి భాయ్ అభిమానులు ఆయనకు పుష్పాలు అందించారు. అవి ఆయ‌న‌ నాకు ఇచ్చాడు. కొందరు అభిమానులు నాతో కూడా ఫొటోలు దిగారు. ఇది నాకు గుర్తుండిపోయే ఘ‌ట‌న‌. మహి భాయ్ నా స్నేహితుడు కాదు.. ఆయ‌న‌ నా అన్నయ్య, నా గురువు అని పేర్కొన్నాడు. నేను పెరుగుతున్నప్పుడు జహీర్ ఖాన్ బౌలింగ్ చూశాను. భారత జట్టు త‌రుపున‌ తొలి ఓవర్ వేయాలని కలలు కన్నాను. ఆసియా కప్‌లో తొలి ఓవర్‌ బౌలింగ్‌ చేసే బాధ్యతను మహీ భాయ్‌ నాకు అప్పగించాడని తెలిపాడు.

ఎంఎస్ ధోనీ ఆధ్వర్యంలో అరంగేట్రం చేసిన‌ యువ ఆట‌గాళ్ల‌లో ఖలీల్ అహ్మద్ ఒకడు. ఖలీల్ అహ్మద్ వయసు 26 ఏళ్లు. అత‌డు జాతీయ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. జింబాబ్వే పర్యటనలో అతడు మూడు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మూడు వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2024 ప్రదర్శనను పరిశీలిస్తే ఖలీల్ 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు.

Tags:    

Similar News