Womens Asia Cup T20 : యూఏఈ ని ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన అమ్మాయిలు

భారత మహిళల క్రికెట్ జట్టు ఆదివారం యూఏఈని 78 పరుగుల తేడాతో ఓడించి ఆసియా కప్-2024లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

By :  Eha Tv
Update: 2024-07-21 13:36 GMT

భారత మహిళల క్రికెట్ జట్టు ఆదివారం యూఏఈని 78 పరుగుల తేడాతో ఓడించి ఆసియా కప్-2024లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. దంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 78 పరుగుల తేడాతో యూఏఈని ఓడించింది. తొలుత రిచా ఘోష్‌, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ధాటికి భార‌త‌ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అనంతరం 20 ఓవర్లు ఆడిన యూఏఈ జట్టు 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.

టీ20లో తొలిసారి భారత్ 200 స్కోరు దాటింది. రిచా, హర్మన్‌ప్రీత్‌ల తుఫాను ఇన్నింగ్స్‌లు ఇందుకు కార‌ణం. రిచా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 29 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అజేయంగా 64 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 47 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 66 పరుగులు చేసింది.

బౌలర్లు కూడా జట్టు విజయంలో సహకరించారు. ఐదుగురు బౌలర్లకు వికెట్లు దక్కాయి. దీప్తి శర్మ అత్యధికంగా రెండు వికెట్లు తీసింది. రేణుకా సింగ్, తనూజా కన్వర్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్‌ల‌కు త‌లో వికెట్ ద‌క్కింది.

ఐదుగురు యూఏఈ బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారు. ఆ జట్టులో కవిషా ఇగోడోగే అత్యధికంగా 40 పరుగులు చేసింది. 32 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో అజేయ ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ ఇషా ఓజా 36 బంతుల్లో 38 పరుగులు చేసింది. వీరిద్దరూ కాకుండా ఖుషీ శర్మ మాత్రమే రెండంకెల స్కోరుకు చేరుకోగలిగింది. ఆమె 10 పరుగులు చేసింది.

Tags:    

Similar News