IPL 2025 : నేడు ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ సమావేశం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 2025 కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 2025 కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేడు ఫ్రాంచైజీలతో బీసీసీఐ సమావేశం కానుంది. ఈ సమావేశంలో నిబంధనలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతి మూడేళ్లకోసారి జరిగే మెగా వేలం పట్ల ఫ్రాంచైజీలు సంతోషంగా లేరని వార్తలు వస్తున్నాయి. కొన్ని జట్లు ఐదుగురు కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను రిటైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కారణంగా BCCI ఫ్రాంచైజీలతో నేడు సమావేశం కానుందని క్రిక్‌బజ్ తెలిపింది. సమావేశానికి వేదిక అధికారికంగా ఖరారు కాలేదు. కానీ ముంబైలోని వాంఖడే స్టేడియం కాంప్లెక్స్‌లోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలోని క్రికెట్ సెంటర్‌లో సమవేశం నిర్వహించాలని భావిస్తున్నారు.
ఆటగాళ్ల రిటైన్‌ల సంఖ్యపై ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఫ్రాంచైజీల డిమాండ్ మేరకు ఎక్కువమంది ఆటగాళ్ల రిటైన్ కు బీసీసీఐ అంగీకరిస్తుందని భావిస్తున్నారు. ఐపీఎల్ టీమ్‌లు దాదాపు ఎనిమిది మంది ఆటగాళ్లను రిటైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇది వేలం పట్ల ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. జట్టులోని ప్రధాన ఆటగాళ్లను తమతో ఉంచుకోవడానికి ఐదు లేదా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే సరిపోతుందనే వాదన కూడా ఉంది.
అలాగే.. రైట్ టు మ్యాచ్ (RTM) కార్డు వివాదాస్పద అంశంగా మిగిలిపోయింది. దీనిపై సమావేశంలో కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. IPL 2018లో BCCI మొదటిసారి RTM కార్డ్‌ని ప్రవేశపెట్టింది. దీని కింద జట్లు తమ ఆటగాళ్లను విక్రయించిన ధరకు తిరిగి పొందవచ్చు.. అయితే.. 2021 మెగా వేలంలో ఆ నిబంధనను పరిగణలోకి తీసుకోలేదు. ఎన్నో ఊహాగానలు ఉన్న నేపథ్యంలో సమావేశం ముగిశాక గానీ అసలు విషయాలు బయటకురావు.