Sri Lanka Tour : టీమిండియాతో కలిసి శ్రీలంక వెళ్ల‌నున్న ఆ ఇద్ద‌రూ..!

గౌతమ్‌ గంభీర్ టీమిండియా హెడ్‌ కోచ్ ఆయ్యాక‌ సపోర్ట్‌ స్టాఫ్‌ ఎవరన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది.

By :  Eha Tv
Update: 2024-07-21 04:39 GMT

గౌతమ్‌ గంభీర్ టీమిండియా హెడ్‌ కోచ్ ఆయ్యాక‌ సపోర్ట్‌ స్టాఫ్‌ ఎవరన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి చాలా మంది మాజీ ఆటగాళ్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. ఇప్పటి వరకు బీసీసీఐ దేనిని అధికారికంగా ధృవీకరించలేదు. కాగా.. శ్రీలంక టూర్‌కు మాత్రం అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్కేట్ మాత్రం భారత జట్టులో సహాయక సిబ్బందిలో భాగం కావ‌చ్చ‌ని నివేదిక‌లు చెబుతున్నాయి.


భారతదేశం తరపున మూడు వ‌న్డేలు ఆడిన అభిషేక్ నాయర్.. నెదర్లాండ్స్ ఆల్-రౌండర్ ర్యాన్ టెన్ డస్కేట్ ఇరువురు గంభీర్‌తో కలిసి IPL ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కోసం పనిచేశారు. వారిద్దరూ భారత జట్టుకు సహాయ కోచ్‌లుగా ఉంటారని నివేదిక‌లు చెబుతున్నాయి. నాయర్‌కు కోచింగ్ అనుభవం ఉంది. దినేష్ కార్తీక్, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లతో కలిసి పనిచేశాడు. డస్కేట్ ప్రస్తుతం మేజర్ క్రికెట్ లీగ్ (MLC)లో LA నైట్ రైడర్స్‌తో కలిసి పనిచేస్తున్నాడు. డాస్కేట్‌ను సపోర్ట్‌ స్టాఫ్‌ లోకి తీసుకోవాలని గంభీర్ బహిరంగంగానే తన కోరికను వ్యక్తం చేశాడు.

భారత జట్టు బౌలింగ్ కోచ్‌కు సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు, అయితే రాహుల్ ద్రవిడ్ హయాంలో ఫీల్డింగ్ కోచ్ పాత్రను పోషిస్తున్న టి. దిలీప్ భవిష్యత్తులో కూడా ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగ‌నున్న‌ట్లు నివేదిక‌లు పేర్కొన్నాయి. బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్ వినయ్ కుమార్, లక్ష్మీపతి బాలాజీ, దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ పేర్లను బీసీసీఐకి గంభీర్ సూచించాడు.

వార్తా సంస్థ PTI ప్రకారం.. ఈ రేసులో వినయ్ కుమార్, బాలాజీల‌ కంటే మోర్కెల్ ముందున్నాడు. గంభీర్ కెకెఆర్‌లో వినయ్, బాలాజీతో కలిసి పని చేయగా.. మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్‌లో గంభీర్‌తో కలిసి పనిచేశాడు. మోర్కెల్ ఆమోదం పొందినట్లయితే.. అతడు ఆస్ట్రేలియాకు చెందిన జో డావ్స్ తర్వాత భారతదేశానికి మొదటి విదేశీ బౌలింగ్ కోచ్ అవుతాడు. డంకన్ ఫ్లెచర్ హయాంలో 2012లో ఇంగ్లండ్ టూర్ వరకు డావ్స్ భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మోర్కెల్ పాకిస్థాన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.

జూలై 27 నుంచి శ్రీలంకతో భారత్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుండగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. భారత జట్టు జూలై 22న ముంబై నుంచి చార్టర్డ్ విమానంలో కొలంబో వెళ్లనుంది. నాయర్, దిలీప్ కూడా జట్టుతో చేరనున్నారు. అయితే ర్యాన్ టెన్ డాస్కేట్ జట్టుతో ఎప్పుడు చేరుతాడ‌నేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Tags:    

Similar News