Aravind Kejriwal : నేడు తీర్పు.. కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారా.?

Update: 2024-09-13 02:33 GMT

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ అరెస్ట్ ను సవాలు చేస్తూ దాఖలు చేసిన‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. సెప్టెంబరు 5న ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్‌లు సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్వల్‌ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తే.. మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు నుండి మధ్యంతర బెయిల్ పొందినందున ఆయ‌న‌ జైలు నుండి బయటకు వస్తారు. ఈడీ మనీలాండరింగ్ కేసులో అప్పటికే జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను.. జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది.

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని కోరింది. ఈ రెండు ఉత్తర్వులను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

సీబీఐ అరెస్టు చట్ట విరుద్ధమని, విడుదల చేసి బెయిల్‌ ఇవ్వాలని కేజ్రీవాల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అరెస్టుపై ప్రశ్నలు లేవనెత్తారు. CrPC సెక్షన్ 41A ప్రకారం.. విచారణ నోటీసు పంపకుండా నేరుగా అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని.. ఆయ‌న‌ను విడుదల చేయాలని వాదించారు.

బెయిల్ అనేది నియమం.. జైలు మినహాయింపు అని సుప్రీంకోర్టు తన అనేక నిర్ణయాలలో చెప్పింది. కేజ్రీవాల్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందున బెయిల్ పొందిన తరువాత పారిపోయే అవకాశం లేదు. కేజ్రీవాల్ దర్యాప్తుకు సహకరించడం లేదని.. దర్యాప్తు సంస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని.. అందుకే ఆయనను అరెస్టు చేశామని.. దర్యాప్తు చేసి అరెస్టు చేసే హక్కు సీబీఐకి ఉందని సీబీఐ అరెస్టును సమర్థించుకుంది.

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ ప్రాథమిక అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బెయిల్ కోసం ఆయ‌న‌ మొదట సెషన్స్ కోర్టుకు వెళ్లాల్సి ఉందని.. బదులుగా నేరుగా హైకోర్టుకు వెళ్లార‌ని.. ఇది సరికాదని పేర్కొంది. కేజ్రీవాల్‌కు బెయిల్‌ లభిస్తే.. సాక్ష్యాలను తారుమారు చేసి కేసును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించవచ్చని పేర్కొంది. 

Tags:    

Similar News