Eruvaka Pornami : ఇవాళే ఏరువాక పౌర్ణమి... దుక్కిదున్నడానికి రైతులు సిద్ధం!

ఇవాళే ఏరువాక పౌర్ణమి... దుక్కిదున్నడానికి రైతులు సిద్ధం!

By :  Eha Tv
Update: 2024-06-21 06:34 GMT

జ్యేష్టమాసంలో వానలు కురవడం మొదలవుతాయి. ఓ వారం అటూ ఇటూ అయినప్పటికీ వర్షాలు మాత్రం తప్పనిసరిగా కురుస్తాయి. పున్నమినాటికల్లా తొలకరి పడుతుంది. భూమి మెత్తపడుతుంది. రైతులకు ఇది ఆనందాన్ని సందర్భం. వ్యవసాయ(Agriculture) పనులకు శ్రీకారం చుట్టే సమయం. ఈ క్రమంలోనే జ్యేష్ట పౌర్ణమి రోజున ఏరువాక పున్నమిగా(Eruvaka Purnami) జరుపుకుంటారు. ఈ రోజున వ్యవసాయ పనిముట్లను(Agriculture Tools) శుభ్రం చేసుకుంటారు రైతులు. నాగలికి పసుపు కుంకుమలు అద్ది, తోరణాలు కట్టి పూజిస్తారు. వ్యవసాయం తమకు సాయం చేస్తూ అండగాఉంటూ, కష్టసుఖాలలో పాలు పంచుకుంటున్న ఎద్దులకు స్నానంచేయిస్తారు. వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి హారతులిస్తారు. పొంగలిని తినిపిస్తారు. ఈ రోజున జరిగే తొలి దుక్కలో కొందరు, తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. . ఇక ఏరువాక సాగుతున్నప్పుడు స్వచ్చమైన జానపదాలు వినిపిస్తాయి. అలుపు సొలుపు తెలియకుండా ఆడబిడ్డలు పాటలు పాడుకుంటారు. ఏరువాక పాటలు మన జీవితంలో ఓ భాగమయ్యాయి. జానపద సాహిత్యంలో ఏరువాక పాటలకు, నాగలి పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. మనం వ్యవసాయాన్ని ఓ క్రతువుగా భావిస్తుంటాం. వ్యవసాయంలో ప్రతీ పనికి ఓ నిర్ధిష్టమైన సమయాన్ని పెట్టుకున్నాం. ఏరువాక పున్నమి రోజున వ్యవసాయ పనులు ప్రారంభం కావాలన్నది మన పెద్దలు నిర్ణయం. అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు భూమి పూజ చేసి దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు.

ఏరు అంటే ఎద్దులను పూన్చి దుక్కి దున్నడానికి సిద్దపరచిన నాగలి. దుక్కిదున్నే పనిని శాస్త్రోక్తంగా ప్రారంభించడాన్ని ఏరువాక అంటారు. సస్యానికి అధిపతి చంద్రుడు. వ్యవసాయ పనులు ప్రారంభించడానికి జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిదని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఔషధాలకు, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో అంటారు, కన్నడంలో కారణి పబ్సం అని జరుపుకుంటారు. అధర్వణవేదంలో అనడుత్సవంగా ఏరువాక ఉంది. పరాశరుడు, బోధాయనుడు లాంటి మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఏరువాకను ప్రస్తావించారు.

విష్ణు పురాణంలో ఏరువాకను సీతాయజ్ఞంగా పేర్కొన్నారు. శుద్ధోదనమహారాజు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించారట! ఇక హాలుడు రాసిన గాథాసప్తశతిలో ఏరువాక గురించి అనేక కథలు ఉన్నాయి. .

Tags:    

Similar News