Tomato : త‌గ్గ‌నున్న ట‌మాట ధ‌ర‌లు.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలే కార‌ణం.!

దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి టమోటాల సరఫరా పెరగడంతో రాబోయే రోజుల్లో టొమాటో ధరలు తగ్గే అవకాశం ఉంది.

By :  Eha Tv
Update: 2024-07-14 02:47 GMT

దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి టమోటాల సరఫరా పెరగడంతో రాబోయే రోజుల్లో టొమాటో ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి శనివారం వెల్లడించారు. భారీ వర్షాల వల్ల సరఫరాకు అంతరాయం కలగకపోతే.. రాబోయే వారంలో ధ‌ర‌లు తగ్గుతాయ‌ని స‌ద‌రు అధికారి పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశ రాజధానిలో టమోటా రిటైల్ ధర కిలో రూ.75కి చేరుకుంది. వినియోగదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జూలై 12న ఢిల్లీలో టమాటా రిటైల్ ధర కిలో రూ.75 ఉండగా.. ఏడాది క్రితం ఇదే స‌మ‌యంలో కిలో ధర రూ.150గా ఉంది. సరఫరాలో అంతరాయం కారణంగా పెరిగిన టమాటా, ఉల్లి ధరలు త్వరలో స్థిరపడే అవకాశం ఉందని అధికారి తెలిపారు.

టమోటాలు, బంగాళదుంపలు, ఉల్లిపాయల ధరలు.. ఢిల్లీ మరికొన్ని నగరాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడి.. రిటైల్ ధరల పెరుగుదలకు దారితీసింది. గత ఏడాది కిలో రూ.53.36గా ఉన్న టొమాటో.. జూలై 12న అఖిల భారత సగటు రిటైల్ ధర రూ.65.21గా ఉంది. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీకి టమోటాలు సరఫరా అవుతున్నాయి. ఢిల్లీలో బంగాళ దుంపల రిటైల్ ధర కిలో రూ. 40 ఉండగా.. గతేడాది ఈ సమయంలో కిలో రూ.25గా ఉంది. కిలో ఉల్లి ధర రూ.57 ఉండగా.. గతేడాది కిలో రూ.33 ఉంది.

Tags:    

Similar News