Kolkata Doctor Case : కోల్‌కతా అత్యాచారం-హత్య కేసును సుమోటోగా స్వీకరించిన‌ సుప్రీంకోర్టు

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది

Update: 2024-08-18 13:14 GMT

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 9వ తేదీన జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా అంద‌రినీ ఆగ్రహావేశాలకు లోనుచేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్య నిపుణుల నిరసనలు, సమ్మెలకు దారితీసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది.

ప్రజల నుంచి నిరసనలు, ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఇద్దరు న్యాయవాదులు, తెలంగాణకు చెందిన ఒక వైద్యుడు శుక్ర‌వారం CJI చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కోల్‌కతా RG కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో ఒక వైద్యురాలిని అత్యాచారం, హత్య చేసిన కేసును సుమోటోగా విచారించవలసిందిగా కోరారు.

ఈ కేసును ప్ర‌స్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ ఘ‌ట‌న‌ భారతదేశంలోని వైద్య నిపుణులు, ముఖ్యంగా మహిళా వైద్యుల భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది.

కోల్‌కతాకు చెందిన ట్రైనీ మహిళా డాక్టర్ మృతదేహం ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లో పడి ఉంది. ఈ నేరానికి సంబంధించి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఇది సామూహిక అత్యాచారం అని బాధితురాలి కుటుంబం, నిరసనకారులు ఆరోపిస్తున్నారు. దీనిని నిర్ధారించడానికి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా.. ఆమె మరణానికి ముందు లైంగిక వేధింపులకు గురైనట్లు నిర్ధారించారు. హత్యకు గురైన వైద్యురాలికి న్యాయం చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డిమాండ్ చేసింది. శనివారం IMA దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. అన్ని అనవసరమైన వైద్య సేవలను 24 గంటలపాటు నిలిపివేసింది.

Tags:    

Similar News