Monkeypox : ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న మంకీఫాక్స్ కొత్త వేరియంట్..!

కాంగోలో వేగంగా వ్యాపించిన మంకీఫాక్స్ త‌ర్వాత‌ పొరుగు దేశాలకు వ్యాపించింది. ఆఫ్రికా తర్వాత మొదటిసారిగా యూరప్, పాకిస్తాన్‌లో కూడా కేసులు నమోదయ్యాయి

Update: 2024-08-24 02:37 GMT

కాంగోలో వేగంగా వ్యాపించిన మంకీఫాక్స్ త‌ర్వాత‌ పొరుగు దేశాలకు వ్యాపించింది. ఆఫ్రికా తర్వాత మొదటిసారిగా యూరప్, పాకిస్తాన్‌లో కూడా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీఫాక్స్‌పై రెండేళ్లలో రెండవసారి ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇదిలావుంటే.. ఇప్పుడు మంకీఫాక్స్‌ కొత్త వేరియంట్ వెలుగులోకి వ‌చ్చింది.

మంకీఫాక్స్ వైరస్ కొత్త వేరియంట్ క్లాడ్ IB ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇది వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోగితో సన్నిహిత సంబంధం ద్వారా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది. క్లాడ్ IB వేరియంట్ ఆఫ్రికా వెలుపల అనేక దేశాలకు వ్యాపించింది.

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీఫాక్స్ రెండు వేరియంట్‌లు గుర్తించారు. అవి క్లాడ్ I, క్లాడ్ IB. క్లాడ్ IB లైంగిక సంబంధంతో సహా సన్నిహిత సంపర్కం ద్వారా మరింత సులభంగా వ్యాపిస్తుంది. WHO డేటా ప్రకారం.. గత రెండు వారాల్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 38 మంకీపాక్స్ కేసులను నిర్ధారించింది.

గ్లోబల్ హెల్త్ అధికారులు.. ఆగస్టు 15న స్వీడన్‌లో మంకీఫాక్స్ వైరస్ కొత్త వేరియంట్‌ సంక్రమణను ధృవీకరించారు. దీంతో ఈ వైర‌స్ ఆఫ్రికన్ ఖండం వెలుపల కూడా వ్యాప్తి చెందుతుంన‌డానికి ఇది మొదటి సంకేతం. స్వీడిష్ ఆరోగ్య అధికారులు ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త వేరియంట్‌ క్లాడ్ IB రకం ఓ వ్యక్తికి సోకినట్లు తెలిపారు. ప్ర‌స్తుతం ఆ వ్యక్తి చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు.

ఆగస్టు 22న థాయ్‌లాండ్‌లో గుర్తించ‌బ‌డిన‌ మంకీఫాక్స్ కేసు క్లాడ్ IB జాతిగా నిర్ధారించబడిందని ఆ దేశ వైద్యాధికారులు చెబుతున్నారు. ఇది దేశంలోనే మొదటి కేసు అని తెలిపారు. ఈ కేసు మొదట ఆగస్టు 21 న నమోదైంది. ఇది ఆఫ్రికన్ దేశం నుండి వచ్చిన 66 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి సోకింద‌ని థాయిలాండ్ తెలిపింది.

ఆగస్టు 18 నాటికి బురుండిలో 153 క్లాడ్ IB మంకీఫాక్స్ కేసులు ఉన్నాయి. ఎటువంటి మరణాలు న‌మోద‌వ‌లేదు. WHO డేటా ప్రకారం.. గత రెండు వారాల్లో దేశంలో 113 క్లాడ్ IB MPOX కేసులు నమోదయ్యాయి.

జూలై 29న కెన్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్లాడ్ IB mpox కేసును ధృవీకరించింది, ఇది దేశంలో మొట్టమొదటి mpox కేసు. WHO డేటా ప్రకారం.. ఆగస్టు 8 వరకు మరణాలు లేవు.

WHO డేటా ప్రకారం.. ఆగష్టు 18 నాటికి ఉగాండా మూడు క్లాడ్ IB MPOX కేసులను గుర్తించింది. ఎటువంటి మరణాలు లేవు. 

Tags:    

Similar News