MK Stalin : నీట్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రధాని, 8 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ

నీట్-యూజీ పరీక్ష పేప‌ర్ లీక్‌పై నిరసనలు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో ఈ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

By :  Eha Tv
Update: 2024-06-29 04:36 GMT

నీట్-యూజీ పరీక్ష పేప‌ర్ లీక్‌పై నిరసనలు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో ఈ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని.. జాతీయ స్థాయిలో ఈ పరీక్షను రద్దు చేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వడంపై ప్రధాని మోదీకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి స్టాలిన్.. ప్రొఫెషనల్ కోర్సుల ఎంపిక ప్రక్రియ 12వ తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే ఉండాలని అన్నారు. నీట్ వల్ల విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువవుతుంది కాబట్టి ఇందు కోసం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదన్నారు. తమిళనాడులో నీట్ పరీక్షను నిర్వహించకూడదని.. 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ కాలేజీలలో ప్రవేశానికి అనుమతించాలని మా అసెంబ్లీలో మేము ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాము. ఆ బిల్లును రాష్ట్రపతికి పంపగా.. ఇంకా ఆమోదించలేదు.

పైన పేర్కొన్న డిమాండ్‌కు సంబంధించి తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసిందని ఆయన శుక్రవారం తెలిపారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించే బిల్లుకు సమ్మతి ఇవ్వాలని, జాతీయ స్థాయిలో ఈ ఎంపిక ప్రక్రియను రద్దు చేసేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

మరోవైపు ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, పంజాబ్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వేర్వేరుగా లేఖలు రాసిన స్టాలిన్‌.. తమ అసెంబ్లీల్లో నీట్‌ పరీక్షను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

తమిళనాడును నీట్ పరీక్ష నుంచి మినహాయించాలన్న డిమాండ్‌పై మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి లేఖ కూడా రాశారు. స్టాలిన్ రాహుల్‌కు రాసిన లేఖ‌లో 'ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నిర్వహించిన నీట్-యుజి పరీక్షలో అవకతవకల సంఘటనలు దేశంలో మెడిసిన్ చదవాలని ఆకాంక్షిస్తున్న చాలా మంది కష్టపడే అభ్యర్థుల కలలను బద్దలు చేశాయి. ఈ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లోని పేద యువత మెడిసిన్‌లో పట్టా పొందాలనే వారి కలలను కూడా నెరవేర్చకుండా చేస్తోంది. ఈ అంశాన్ని, తమిళనాడు డిమాండ్‌ను పార్లమెంటులో లేవనెత్తాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దేశ యువత ప్రయోజనాల దృష్ట్యా ఆయా అసెంబ్లీలలో ఇలాంటి తీర్మానాలను ఆమోదించాలని ప్రతిపక్ష కూటమిలో ఉన్న రాష్ట్రాలను కూడా సూచిస్తున్నాను' అని ఆయన అన్నారు.

Tags:    

Similar News