RG Kar Protests : డిమాండ్లకు తలవంచిన ప్రభుత్వం.. అయినా నిరసన కొనసాగిస్తున్న వైద్యులు
బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో న్యాయం కోసం ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్‌లకు తలవంచింది
బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో న్యాయం కోసం ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్‌లకు తలవంచింది. జూనియర్ డాక్టర్లతో సమావేశం అనంతరం కోల్‌కతా పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ (నార్త్), డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లను తొలగిస్తున్నట్లు మమత ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ మరోవైపు ఉద్యమం కొనసాగుతుందని వైద్యులు తెలిపారు.
సమావేశం అనంతరం ఆందోళనకు దిగిన వైద్యులు మాట్లాడుతూ.. తమ డిమాండ్లపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే వరకూ తమ విధులు నిలిపివేత కొనసాగుతుందని,.. నిరసన తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో జరిగబోయే విచారణ కోసం కూడా మేము ఎదురుచూస్తున్నామని వారు తెలిపారు. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం తమ వర్క్ బంద్, నిరసనలపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
నిరసనపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం తన నివాసంలో జూనియర్ డాక్టర్లతో రెండు గంటలపాటు సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడిన మమత.. అధికారులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ కొత్త పోలీస్ కమిషనర్‌కు బాధ్యతలు అప్పగిస్తారని ఆమె తెలిపారు. దీంతో పాటు ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లను విధుల్లోకి తీసుకోవాలని మమత విజ్ఞప్తి చేశారు.