Train Accident : జార్ఖండ్‌లో భారీ రైలు ప్రమాదం
హౌరా నుంచి ముంబైకి వెళ్తున్న 12810 ముంబై రైలు ప్రమాదానికి గురైంది. జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ డివిజన్‌లోని రాజ్‌ఖర్స్వాన్-బడబాంబో స్టేషన్‌ల మధ్య ఈ ఘటన జరిగింది
హౌరా నుంచి ముంబైకి వెళ్తున్న 12810 ముంబై రైలు ప్రమాదానికి గురైంది. జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ డివిజన్‌లోని రాజ్‌ఖర్స్వాన్-బడబాంబో స్టేషన్‌ల మధ్య ఈ ఘటన జరిగింది. దట్టమైన అడవిలో రాత్రి వేళలో రైలు ఒక్కసారిగా బలమైన కుదుపుకు గురైంది. జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్‌లోని బారాబంబు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3:43 గంటలకు హౌరా-ముంబై మెయిల్ (12810) 20 కోచ్‌లు గూడ్స్ రైలును ఢీకొనడంతో పట్టాలు తప్పాయి. రాజ్‌ఖర్సావాన్, బడాబంబు స్టేషన్‌ల మధ్య కిలోమీటరు నంబర్ 298/21 వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
ఈ ఘటనతో సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని టాటానగర్-చక్రధర్‌పూర్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దు చేయగా.. కొన్ని రైళ్లను దారి మళ్లించిన మార్గాల్లో నడుపుతున్నారు. రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన పట్టాలను బాగు చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనిలో ఉన్నారు.
అందిన సమాచారం ప్రకారం.. హౌరా నుండి ముంబైకి వెళ్లే ముంబై మెయిల్ సోమవారం రాత్రి 11:02 గంటలకు బదులుగా 2:37 గంటలకు టాటానగర్ చేరుకుంది. రెండు నిమిషాలు ఆగి.. తదుపరి స్టేషన్ చక్రధర్‌పూర్‌కు బయలుదేరింది. కానీ స్టేషన్ చేరుకోకముందే 3.45 గంటలకు క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో రైలులోని 20 కోచ్‌లు పట్టాలు తప్పాయి. గూడ్స్ రైలు కోచ్‌లు కూడా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని చక్రధర్‌పూర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఆదిత్య కుమార్ చౌదరి ధృవీకరించారు.
ఈ ప్రమాదం తర్వాత హౌరా-ముంబై మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అందిన సమాచారం ప్రకారం.. ప్రమాదం కారణంగా ఓవర్ హెడ్ లైన్లు, పిల్లర్లు, రైలు పట్టాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.