Giriraj Singh : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌పై దాడి
బిహార్ రాష్ట్రం బెగుసరాయ్‌లోని బల్లియాలో జనతా దర్బార్ ముగించుకుని బయటకు వచ్చిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌పై దాడికి యత్నించారు
బిహార్ రాష్ట్రం బెగుసరాయ్‌లోని బల్లియాలో జనతా దర్బార్ ముగించుకుని బయటకు వచ్చిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌పై దాడికి యత్నించారు. దాడికి ప్రయత్నించిన బల్లియాకు చెందిన ఆప్ నాయకుడు సహజదు జమా అలియాస్ సైఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. బల్లియాలో జనతా దర్బార్ ముగిసిన తర్వాత గిరిరాజ్ సింగ్ బ్లాక్ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆప్ నేత సహజదు జమా అలియాస్ సైఫీ.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీనిపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఇప్పుడు సమయం ముగిసిందని, దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటే జనతా దర్బార్‌కు రావాల్సిందన్నారు.
దరఖాస్తు తీసుకోవడానికి అంగీకరించకపోవడంతో సైఫీ.. నువ్వు కూడా నా ఎంపీవే.. దరఖాస్తు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిపై గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. నేను మీ ఎంపీని కాదు అని బదులిచ్చారు. దీంతో వాగ్వాదం మొదలయ్యింది. ఈ సమయంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు, సైఫీకి మధ్య తోపులాట మొదలైంది. దీంతో సెక్యూరిటీ గార్డు సైఫీని పట్టుకుని బల్లియా పోలీసులకు అప్పగించాడు. పోలీసులు అతడిని బల్లియా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.