Maharashtra : గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది నక్సలైట్లు హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో బుధవారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య మధ్య ఎదురుకాల్పులు జరిగాయి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో బుధవారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సలైట్లు హతమయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. వందోలి గ్రామంలో మధ్యాహ్నం సీ60 కమాండోలు, నక్సలైట్ల మధ్య భారీ కాల్పులు జరిగాయని గడ్చిరోలి పోలీసు సూపరింటెండెంట్ నీలోత్పాల్ తెలిపారు. దాదాపు ఆరు గంటలపాటు ఎన్‌కౌంటర్ కొనసాగిందని వెల్లడించారు.
ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుంచి 12 మంది నక్సలైట్ల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే.. మూడు AK47లు, రెండు INSAS రైఫిల్స్, కార్బైన్లు, SLRలతో సహా ఏడు ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. హతమైన నక్సలైట్లలో ఒకరిని 'డివిజనల్ కమిటీ మెంబర్' (డివిసిఎం) లక్ష్మణ్ అత్రమ్ అలియాస్ విశాల్ ఆత్రంగా గుర్తించారు. అతడు నిషేధిత సంస్థలో టిప్‌గడ్డ దళం ఇన్‌చార్జిగా ఉన్నాడు.
ఎన్‌కౌంటర్ అనంతరం మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సీ60 కమాండో టీమ్, గడ్చిరోలి పోలీసులకు రూ.51 లక్షల రివార్డు ప్రకటించినట్లు నీలోత్పాల్ తెలిపారు. హతమైన నక్సలైట్లను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గాయపడిన వారిలో సి-60కి చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్, జవాన్ ఉన్నారని వెల్లడించారు.