New Rules: సెప్టెంబర్ 1 నుంచి ఈ మార్పులు.. OTP ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం..!

గూగుల్, ఆధార్ కార్డ్, మెసేజింగ్-కాలింగ్ నియమాలలో మార్పులు రానున్నాయి

Update: 2024-08-29 03:20 GMT

గూగుల్, ఆధార్ కార్డ్, మెసేజింగ్-కాలింగ్ నియమాలలో మార్పులు రానున్నాయి. ఈ మార్పులు మొబైల్ వినియోగదారులపై ప్రభావం చూపనుంది. ఫేక్ కాల్స్, మెసేజ్‌లను ఆపేందుకు టెలికాం కంపెనీలకు ఆగస్టు 30 వరకు గడువు ఇచ్చింది TRAI. అలాగే ఉచిత‌ ఆధార్ అప్‌డేట్‌కు సంబంధించి గ‌డువు పొడిగించారు. అలాగే గూగుల్ తన ప్లాట్‌ఫారమ్ ప్లే స్టోర్‌ నుండి కొన్ని యాప్‌లను తొలగిస్తోంది. UPI, RuPay క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై NPCI కొత్త నిబంధనలు జారీ చేసింది. అవేంటో తెలుసుకుందాం..

మెసేజ్‌, OTP అందుకోవడంలో ఆలస్యం..

ఫేక్ కాల్స్, మెసేజ్‌లను ఆపేందుకు టెలికాం కంపెనీలకు ఆగస్టు 30 వరకు గడువు ఇచ్చింది TRAI. సెప్టెంబర్ 1 నుంచి ఫేక్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం.. ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, జియో, బిఎస్‌ఎన్‌ఎల్ వంటి టెలికాం కంపెనీలు గుర్తుతెలియ‌ని మెసేజ్‌లు, కాల్‌లను గుర్తించి బ్లాక్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఆగస్టు 30 వరకు గడువు ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో కొంతమంది మొబైల్ వినియోగదారులు సెప్టెంబర్ 1 నుండి బ్యాంకింగ్ కాల్స్, మెసేజ్‌లు, OTPని స్వీకరించడంలో ఆలస్యం కావచ్చు. సెప్టెంబర్ 1, 2024 నుండి URLలు, OTT లింక్‌లు, APKలు (Android అప్లికేషన్ ప్యాకేజీలు) లేదా కాల్-బ్యాక్ నంబర్‌లను కలిగి ఉన్న సందేశాలను బ్లాక్ చేయాలని TRAI ఆదేశించింది. దీంతో మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా OTP ఆధారిత చెల్లింపు చేస్తే OTP పొందడంలో ఆలస్యం అవొచ్చు. మీరు ఆన్‌లైన్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్ వంటి పనులలో సమస్యలను ఎదుర్కోవచ్చు.

Google Play Store నుండి ఈ యాప్‌లు తొల‌గింపు..

Google కొత్త Play Store విధానం సెప్టెంబర్ 1, 2024 నుండి అమలు చేయబడుతోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న తక్కువ క్వాలిటీ యాప్‌లు అన్నింటినీ సెప్టెంబర్ 1 నుండి గూగుల్ తన ప్లే స్టోర్ నుండి తొలగించబోతోందని గూగుల్ తెలిపింది. ఈ యాప్‌లు మాల్‌వేర్ బారిన‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని గూగుల్ విశ్వసిస్తోంది. దీంతో అన్ని యాప్‌లను తీసివేయమని Google క్వాలిటీ కంట్రోల్ ద్వారా సూచనలు వ‌చ్చాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. వినియోగదారుల భద్రత, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది.

ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్..

భారత విశిష్ట గుర్తింపు అథారిటీ అంటే UIDAI.. ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి గడువును 14 సెప్టెంబర్ 2024 వరకు పొడిగించింది. అంతకుముందు 14 జూన్ 2024 వ‌ర‌కూ గ‌డువు ఉండ‌గా పొడిగించారు. My Aadhaar పోర్టల్ ద్వారా ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. ఆధార్ సెంటర్‌ను సందర్శించి ఆధార్‌ను అప్‌డేట్ చేసుకుంటే సర్వీస్ ఛార్జీగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే ఉచిత ఆధార్ అప్‌డేట్ సౌకర్యాన్ని వినియోగదారులు పొంద‌గ‌ల‌రు.

రూపే కార్డ్ రివార్డ్ పాయింట్

NPCI యొక్క కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు RuPay క్రెడిట్ కార్డ్, UPI లావాదేవీల రుసుములు మీ రూపే రివార్డ్ పాయింట్‌ల నుండి తీసుకోబ‌డ‌వు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని అన్ని బ్యాంకులకు తెలియజేసింది. NPCI యొక్క ఈ కొత్త నియమం సెప్టెంబర్ 1, 2024 నుండి దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది.

Tags:    

Similar News