Crime : కీచక టీచర్.. అసభ్యకర వీడియోలు చూపిస్తూ ఆరుగురు బాలికలపై లైంగిక వేధింపులు
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన ఉదంతం మంగళవారం వెలుగులోకి రావడంతో నగరంలో తీవ్ర కలకలం రేగింది
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన ఉదంతం మంగళవారం వెలుగులోకి రావడంతో నగరంలో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో తల్లిదండ్రులకు సాధారణ పౌరుల మద్దతు లభించింది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. అకోలాలో బుధవారం ఆరుగురు పాఠశాల బాలికలపై వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఎనిమిదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినులను ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు వారికి అసభ్యకర వీడియోలు చూపించి అనుచితంగా తాకేవారని ఆరోపించారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాజీఖేడ్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రమోద్ మనోహర్ సర్దార్.. ఆరుగురు పాఠశాల బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని అకోలా పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితుడైన ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధిత బాలికల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇండియన్ జస్టిస్ కోడ్, పోక్సో చట్టంలోని సెక్షన్ 74, 75 కింద కేసులు నమోదు చేసినట్లు అకోలా ఎస్పీ బచ్చన్ సింగ్ తెలిపారు.
ఈ ఘటనపై ఎస్పీ అకోలా బచ్చన్ సింగ్ మాట్లాడుతూ.. కాజీఖేడ్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రమోద్ మనోహర్ సర్దార్ ఆరుగురు పాఠశాల బాలికలను వేధింపులకు గురిచేసినట్లు అకోలా పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్టు చేసి వాంగ్మూలాలు నమోదు చేశారని తెలిపారు. విద్యార్థినులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడంతో నేరం వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాఠశాలను సందర్శించి కొంతమంది బాలికలతో మాట్లాడి కేసు నమోదు చేశారు. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు ఆశా మిర్గే డిమాండ్ చేశారు.