తనకు న్యాయబద్ధంగా కోర్టు ద్వారా వచ్చిన నాలుగెకరాల భూమిని ఆన్‌లైన్ చేయాలంటే అధికారులు పక్కలో పడుకోవాలంటున్నారని ఆరోపణ చేస్తూ తహశీల్దార్ ఆఫీస్‌లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

తనకు న్యాయబద్ధంగా కోర్టు ద్వారా వచ్చిన నాలుగెకరాల భూమిని ఆన్‌లైన్ చేయాలంటే అధికారులు పక్కలో పడుకోవాలంటున్నారని ఆరోపణ చేస్తూ తహశీల్దార్ ఆఫీస్‌లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన చాకలి పెద్ద సవారన్నకు ఇద్దరు భార్యలు.
రెండో భార్య రాములమ్మ కుమార్తె హైమావతికి, మొదటి భార్య సంతానం మధ్య ఆస్తి పంపకంలో వివాదం ఏర్పడింది. 2011లో కోర్టును ఆశ్రయించింది. 2024లో ఆస్తిలో సగభాగమైన 4ఎకరాల భూమి హైమావతికి చెందుతుందంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు మేరకు తండ్రి నుంచి తనకు సంక్రమించిన 94, 95, 116 సర్వే నంబర్లలోని నాలుగెకరాల భూమిని తన పేరు మీద ఆన్‌లైన్ చేయాలంటూ హైమావతి కోడుమూరు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. రెవెన్యూ అధికారులు రూ.లక్ష లంచం అడిగారని.. ఆ డబ్బు ఇచ్చానని ఆమె వెల్లడించింది. డబ్బు తీసుకోవడంతో పాటు తమ పక్కలోకి వస్తేనే సదరు భూమిని ఆన్‌లైన్ చేస్తామని వీఆర్వోలు వేధిస్తున్నారని..రెవెన్యూ అధికారుల వేధింపుల వల్ల తనకు చావే శరణ్యమంటూ మంగళవారం తహసీల్దార్ వెంకటేష్ నాయక్ ఎదుట ఫినాయిల్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తహసీల్దార్ ఆమె చేతిలోని ఫినాయిల్ డబ్బాను లాక్కుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై తహసీల్దార్ వెంకటేష్ నాయక్ వివరణ ఇస్తూ.. కోర్టు తీర్పు హైమావతికి అనుకూలంగా వచ్చిన మాట వాస్తవమేనన్నారు.
