Minister TG Bharath : ఆయన సీఎం అయ్యాక పారిశ్రామికవేత్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక పారిశ్రామికవేత్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక పారిశ్రామికవేత్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో వెర్మీరియన్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం మంత్రి టి.జి భరత్‌తో సమావేశమయ్యారు. శ్రీసిటీలో ఉన్న వెర్మీరియన్ కంపెనీ యూనిట్‌ను విస్తరించేందుకు మంత్రితో చర్చలు జరిపారు.
సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ రూ. 100 కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెర్మీరియన్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రి పరికరాల తయారీలో వెర్మీరియన్ కంపెనీ పేరుగాంచిందన్నారు. త్వరలోనే శ్రీసిటీలోని కంపెనీని విస్తరించేందుకు పనులు ప్రారంభిస్తారని మంత్రి టి.జి భరత్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో పెట్టుబడిదారులు ఏపీకి తరలివస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ రియాజ్ ఖాద్రీ, తదితరులు ఉన్నారు.