Crime : కిడ్నాప్‌కు గురైన పసికందును కేవలం 3 గంటల్లోనే రక్షించిన పోలీసులు
అనంతపురం జిల్లాలో కిడ్నాప్‌కు గురైన 5 రోజుల పసికందును మూడు గంటల్లో రక్షించి పోలీసులు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
అనంతపురం జిల్లాలో కిడ్నాప్‌కు గురైన 5 రోజుల పసికందును మూడు గంటల్లో రక్షించి పోలీసులు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. డీఎస్పీ టీవీవీ ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగలూరు గ్రామానికి చెందిన అమృత(25) జులై 16న ప్రభుత్వాసుపత్రిలో చేరగా.. 23న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పాప కనిపించకపోవడంతో అమృత గమనించి వెంటనే సమాచారం అందించింది. ఆమె కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్ విషయం తెలుసుకున్న ఎస్పీ కేవీ మురళీకృష్ణ.. డీఎస్పీని అప్రమత్తం చేశారు. పట్టణ సీఐలు క్రాంతికుమార్, ప్రతాప్ రెడ్డి, ఏఎస్సై త్రిలోక్‌నాథ్‌తో పాటు డీఎస్పీ ప్రతాప్ వార్డులోని రోగులను విచారించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నారాయణపురం గ్రామానికి చెందిన ఆమని అనే మహిళ శిశువును తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
ఆమనిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పాప కనిపించకుండా పోయిన మూడు గంటలకే పోలీసులు పాపను వెతికి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసును సమర్థంగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ మురళీకృష్ణ అభినందించారు.