Minister Parthasarathy : 100 రోజుల్లో 1.28 లక్షల గృహాలను పూర్తి చేయాలని లక్ష్యం

రాష్ట్రంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద వచ్చే మూడు మాసాల్లో లక్షా 28వేల గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కె.పార్ధ సారధి వెల్లడించారు.

By :  Eha Tv
Update: 2024-07-04 03:44 GMT

రాష్ట్రంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద వచ్చే మూడు మాసాల్లో లక్షా 28వేల గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కె.పార్ధ సారధి వెల్లడించారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖపై అన్ని జిల్లాల ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌లు, ఎస్ఈ, ఈఈలు ఆశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ప్రభుత్వ శాఖలు 100 రోజుల కార్యాచరణను రూపొందించుకోవాలన్న ఆదేశాలకు అనుగుణంగా గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 100 రోజుల కార్యాచరణ కింద రానున్న మూడు మాసాల్లో 1.28 లక్షల గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు పునరుద్ఘాటించారు. ఇందుకు గాను 2వేల 520 కోట్ల రూపాయ‌లను ఖర్చు చేయనున్నట్టు మంత్రి పార్ధసారధి తెలిపారు.

అంతేగాక రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 8.02 లక్షల గృహాలను వచ్చే మార్చి నెలాఖరుకు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు మంత్రి పార్ధసారధి చెప్పారు. అదే విధంగా నిర్మాణ దశలో ఉన్న 6.08 లక్షల గృహాల స్టేజ్ కన్వర్సన్ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.గృహ నిర్మాణాలు జరిగే లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి విశాఖపట్నం, విజయవాడ,నెల్లూరు,రాయల సీమల్లోని ధర్మల్ పవర్ స్టేషన్ల నుండి వచ్చే ప్లై యాష్ వినియోగించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు.అదే విధంగా ఆప్సన్-3 కింద నిర్మాణంలో ఉన్న గృహాలకు సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి వివరించారు.

రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలను వేగవంతంగా పూర్తి చెయ్యటానికి అధికారులందరూ కృషి చెయ్యాలని ఆదేశించామని మంత్రి పార్ధ సారధి చెప్పారు.గృహ నిర్మాణాలకు సంబంధించి ఈనెలాఖరు లోగా రీకన్సిలేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.అంతేగాక ఇకమీదట ప్రతి నెలా గృహ నిర్మాణాల ప్రగతిని అధికారులతో సమీక్షించడం జరుగుతుందని అన్నారు.

Tags:    

Similar News