Amaravathi : అమరావతిలో నిలిచిపోయిన పనులపై టెక్నికల్ కమిటీ ఏర్పాటు
రాజధాని లో నిలిచిపోయిన పనులపై ప్రభుత్వం టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసింది.
రాజధాని లో నిలిచిపోయిన పనులపై ప్రభుత్వం టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో నిలిచిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కమిటీ సిఫార్సులు చేయనుంది. అమరావతి కేపిటల్ సిటీీ లో ఉన్న సమస్యలను గుర్తించి కమిటీ సూచనలు చేయనుంది. పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ ఛైర్మన్ గా మొత్తం ఏడుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా ఆర్ అండ్ బీ, వీఎంసీ, ఏపీసీపీడీసీఎల్, ఏపీసీఆర్డీఏ, ఏడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ డిపార్ట్ మెంట్ నుంచి ఒక ప్రతినిది ఉంటారు. ఏపీసీఆర్డీఏలో పనులకు సీఆర్డీఏ సీఈ కన్వీనర్ గాను, ఏడీసీఎల్ పనులకు కన్వీనర్ గా ఏడీసీఎల్ సీఈ ఉంటారు. మొత్తం 9 అంశాలపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. నెలరోజుల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు.
రాజధాని నిర్మాణంలో పనుల ప్రస్తుత పరిస్థితిని సాంకేతిక కమిటీ అధ్యయనం చేయనుంది. మే 2019 నుంచి నిలిచిపోయిన వివిధ భవనాల పటిష్టతను కమిటీ అంచనా వేసి.. దీని కోసం సలహాలు కూడా తీసుకోనుంది. రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై కోసం వేసిన పైప్ లైన్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పనులకు జరిగిన నష్టం కమిటీ అంచనా వేయనుంది.
రాజధానిలోని పలు ప్రాంతాల్లో మిగిలి ఉన్న మెటీరియల్ క్వాలిటీ పరిశీలించనుంది. పైప్ లు, ఇనుము, ఇతర మెటీరియల్ సేవా సామర్ధ్యం కమిటీ అంచనా వేయనుంది. అవసరమైన చోట తిరిగి పరికరాలు అమర్చడంపై కమిటీ పలు సూచనలు చేయనుంది. నిలిచిపోయిన అన్ని పనులపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కమిటీ సిఫార్సులు చేయనుంది. నిలిచిపోయిన పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై కమిటీ నిర్ధిష్టమైన సూచనలు చేయనుంది. వివిధ కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చే క్లెయిమ్ లను అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేశారు.