Pawan Kalyan : ఎర్ర చందనం అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోండి

శేషాచలం అడవుల్లో భారీగా ఎర్ర చందనం వృక్షాలను నరికేశారు. ఆ దుంగలను ఎక్కడెక్కడ దాచారో తక్షణమే గుర్తించండి. ఎర్ర చందనం స్మగ్లర్ల నెట్వర్క్ ను నడిపిస్తున్న కింగ్ పిన్స్ ను పట్టుకోవాలి.

By :  Eha Tv
Update: 2024-07-06 03:32 GMT

అత్యంత విలువైన ఎర్ర చందనాన్ని అడ్డగోలుగా నరికేసి జిల్లాలు, రాష్ట్రాలు దాటించి విదేశాలకు అక్రమంగా తరలించేస్తున్న క్రమంలో నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని, అక్రమ రవాణా చేస్తున్నవారిని అరెస్టు చేయడంతోపాటు వాళ్ళ వెనక ఉన్న పెద్ద తలకాయలను అదుపులోకి తీసుకోవాలని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

ఇటీవల కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్ర చందనం డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కడప జిల్లా అటవీ శాఖ అధికారులు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించారు. ఈ క్రమంలో దూదేకుల బాషా, మహ్మద్ రఫీ, అరవోల్ల రఫీ, చెల్లుబోయిన శివ సాయిలను పోలీసులు అరెస్టు చేశారనీ, ఈ కేసుతో లతీఫ్ బాషా, లాల్ బాషా, జాకీర్, ఫక్రుద్ధీన్ లకు సంబంధం ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. జగనన్న కాలనీలో దాచి ఉంచిన డంప్ లో 158 ఎర్ర చందనం దుంగలు దొరికాయనీ, వీటి విలువ రూ.1.6 కోట్లు అని నివేదికలో పేర్కొన్నారు.

వై.ఎస్.ఆర్. కడప జిల్లాకు సంబంధించిన కేసు వివరాలు తెలుకున్నాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. “శేషాచలం అడవుల్లో భారీగా ఎర్ర చందనం వృక్షాలను నరికేశారు. ఆ దుంగలను ఎక్కడెక్కడ దాచారో తక్షణమే గుర్తించండి. ఎర్ర చందనం స్మగ్లర్ల నెట్వర్క్ ను నడిపిస్తున్న కింగ్ పిన్స్ ను పట్టుకోవాలి. రవాణా దశలోనో, దాచి ఉంచిన దగ్గరో పట్టుకోవడంతోపాటు – నరికివేత కూలీలు, రవాణాదారులను తెర వెనక ఉండి నడిపిస్తున్నవాళ్లను గుర్తించి అరెస్టు చేయాలి. అలాంటి కింగ్ పిన్స్ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా కేసులు పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయి బెయిల్ మీద బయట తిరుగుతున్నవారి కార్యకలాపాలు, వాళ్ళకు ఎవరెవరితో లావాదేవీలు నడుస్తున్నాయి లాంటి అంశాలపై నిఘా ఉంచాలి. ఈ దిశగా అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పని చేయాలి” అన్నారు.

ఎర్ర చందనం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటి వరకూ నమోదైన కేసుల వివరాలపై చర్చించారు. నమోదైన వాటిలో ఎన్ని కేసుల్లో శిక్షలుపడ్డాయో, ఎన్ని కేసులు వీగిపోయాయో వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. కేసులు వీగిపోతే అందుకుగల కారణాలను పేర్కొనాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు, నేపాల్ దేశంలో పట్టుబడ్డ కేసుల్లో అక్కడ ఉండిపోయిన ఎర్ర చందనం దుంగలను తిరిగి తెచ్చుకోవడంపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.

Tags:    

Similar News